గాలి పీల్చినా ముప్పే!

అడుగు బయటపెడితే ముఖాలు మాడిపోయేలా ఎండలు మండిపోతున్నాయి. పోనుపోను దట్టమవుతున్న కాలుష్య మేఘాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణభారతానికి ప్రాణాంతకమవుతున్న   వాయుకాలుష్యం- భానుడి భగభగలకు మరింతగా ఆజ్యంపోస్తోంది. 

Published : 04 May 2024 00:10 IST

డుగు బయటపెడితే ముఖాలు మాడిపోయేలా ఎండలు మండిపోతున్నాయి. పోనుపోను దట్టమవుతున్న కాలుష్య మేఘాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణభారతానికి ప్రాణాంతకమవుతున్న వాయుకాలుష్యం- భానుడి భగభగలకు మరింతగా ఆజ్యంపోస్తోంది.  హైదరాబాద్‌లో గాలిలో కాలుష్యకారకాలు తక్కువగా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే- అవి విపరీతంగా పోగుపడిన ప్రదేశాల్లో ఉష్ణతాపం తీవ్రంగా ఉన్నట్లు ఎన్‌ఐటీ-తిరుచ్చి పరిశోధక బృందం తాజాగా వెల్లడించింది. వాతావరణంలో కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ డైయాక్సైడ్‌, ఫార్మాల్డీహైడ్‌ వంటి వాటి పరిమాణం హద్దులు దాటిన చోట్ల ఉష్ణోగ్రతలూ 2.6 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే అధికంగా నమోదవుతున్నట్లు ఆ అధ్యయనంలో వెలుగు చూసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో కేవలం వాహనాల ద్వారానే రోజుకు 1500 టన్నుల కాలుష్య కారకాలు వెలువడుతున్నాయన్నది రాష్ట్ర రవాణాశాఖ అంచనా! పీల్చేగాలిని అవి గరళంగా మార్చడమే కాదు- వాతావరణ మార్పులకు అంటుకడుతూ జనజీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి.  విశాఖపట్నం, అనంతపురం వంటి నగరాల వాయునాణ్యత సైతం ప్రజారోగ్యానికి ఇబ్బందికరంగానే ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనాంశాలు చాటుతున్నాయి. వ్యక్తిగత వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడి అవుతున్న కొద్దీ శిలాజ ఇంధనాల వాడకం ఇంతలంతలవుతోంది. దానికితోడు  విషధూమాల వెలువరింతలో పోటీపడుతున్న పరిశ్రమలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నగరాల్లో పెచ్చరిల్లుతున్న ప్లాస్టిక్‌, ఎలెక్ట్రానిక్‌, బయో వ్యర్థాల దహనం సైతం వాయునాణ్యతను ఘోరంగా దిగనాసిల్లజేస్తోంది. వీటన్నింటి ఫలితంగా- జీవించే హక్కే గాలిలో కలిసిపోతోంది!

పీఎం-2.5గా పిలిచే సూక్ష్మ ధూళికణాల గాఢత గాలిలో ఎక్కువైతే ప్రజారోగ్యానికి ముప్పు తీవ్రతరమవుతుంది. ఏ ప్రాంతంలోనైనా ఘనపు మీటరు పరిమాణంలో సూక్ష్మ ధూళికణాలు అయిదు మైక్రోగ్రాములకు మించి ఉండరాదన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణం. భారతావనిలో అవి ఘనపు మీటరుకు సగటున 54.4 మైక్రోగ్రాముల మేర మేటవేసిన దుర్భరావస్థను విశ్వ వాయునాణ్యతా సూచీ-2023 ఇటీవలే వెలుగులోకి తెచ్చింది. 134 దేశాల స్థితిగతులను సరిపోల్చిన ఆ సూచీ- బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల తరవాత వాయుకాలుష్యం అత్యంత అధికంగా ఉన్నది ఇండియాలోనేనని తేల్చిచెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కలుషితభరితమైన మొదటి యాభై నగరాల్లో నలభై రెండింటికి నెలవుగానూ భారతావని పరువుమాసింది. వాయుకశ్మలం కారణంగానే జనభారతంలో ఏటా దాదాపు 22 లక్షల అర్ధాంతర మరణాలు సంభవిస్తున్నాయి. ఆ మేరకు జర్మన్‌ శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలు నిరుడు  దేశీయంగా గగ్గోలురేపాయి. గాలిలో కాలుష్యకారకాలను గణనీయంగా తగ్గించేందుకు జిల్లాలూ నగరాల వారీగా ప్రణాళికల రూపకల్పనపై ప్రభుత్వాల ప్రకటనలు నీటిపై రాతలవుతున్నాయి. రూ.10వేల కోట్లకు పైబడిన కేటాయింపులతో ఘనంగా చేపట్టిన జాతీయ వాయుశుద్ధి కార్యక్రమమూ అమలులో చతికిలపడింది. కాలుష్యకారక పరిశ్రమలను గట్టిగా కట్టడి చేస్తూ, ప్రజారవాణాకు పెద్దపీట వేస్తున్న చైనా- జనారోగ్యానికి రక్షరేకు కడుతోంది. దేశీయంగానూ ప్రజారవాణాను ప్రభుత్వాలు పటిష్ఠపరిస్తే- ప్రజలకు ప్రయాణ ఖర్చులు కలిసి వస్తాయి. దాంతో ప్రమాదాలు అదుపులోకి రావడమే కాదు, హానికారక వాహన ఉద్గారాలూ భారీగా తగ్గుతాయి. ప్రజారవాణా వ్యవస్థలను ఆదాయ వనరులుగా భావించకుండా- దగ్గరి, దూర ప్రాంతాలు అన్నింటికీ రైళ్లు, బస్సులను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలి. ఎలెక్ట్రికల్‌ వాహనాల వినియోగాన్నీ ప్రోత్సహించాలి. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా వ్యవహరిస్తేనే-  దేశీయంగా కాలుష్యభూతం స్వైరవిహారాన్ని అడ్డుకోగలం. కట్టుతప్పుతున్న పరిశ్రమలను గాడినపెట్టాలంటే- భ్రష్టుపట్టిన కాలుష్యనియంత్రణ మండళ్ల ప్రక్షాళన అత్యవసరం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు