జగన్‌ పెడపాలనపై ప్రధాని ధర్మాగ్రహం

అభివృద్ధికి ఆటపట్టుగా విరాజిల్లాల్సిన ఆంధ్రప్రదేశ్‌ను అంతులేని అవినీతి, అరాచకాలకు నెలవుగా మార్చేసిన మహమ్మారి పాలన జగన్‌మోహన్‌ రెడ్డిది. వైకాపా అధినేత కబంధ హస్తాల్లో చిక్కిశల్యమైన ఏపీ దారుణావస్థపై ప్రధాని మోదీ ఆవేదన, ధర్మాగ్రహం- మొన్న సోమవారం ఆయన మాటల్లోనే వ్యక్తమయ్యాయి.

Published : 08 May 2024 00:39 IST

భివృద్ధికి ఆటపట్టుగా విరాజిల్లాల్సిన ఆంధ్రప్రదేశ్‌ను అంతులేని అవినీతి, అరాచకాలకు నెలవుగా మార్చేసిన మహమ్మారి పాలన జగన్‌మోహన్‌ రెడ్డిది. వైకాపా అధినేత కబంధ హస్తాల్లో చిక్కిశల్యమైన ఏపీ దారుణావస్థపై ప్రధాని మోదీ ఆవేదన, ధర్మాగ్రహం- మొన్న సోమవారం ఆయన మాటల్లోనే వ్యక్తమయ్యాయి. రాజమహేంద్రవరం, అనకాపల్లి సభల్లో జగన్‌ సర్కారుపై సమరశంఖం పూరించిన ప్రధాని- వైకాపా లూఠీ రాజకీయాలను దునుమాడారు. భూ మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియాలను వైకాపా ప్రభుత్వమే నడిపిస్తోందన్న మోదీ వ్యాఖ్యలు అక్షరసత్యాలు! అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల విలువైన భూములను మింగేసిన భూతాలకు అధినాయకుడు జగన్‌. ఆయన పార్టీ నేతలు, వారి బినామీలు ఒక్క విశాఖపట్నంలో చెరపట్టిన స్థలాల ఖరీదే దాదాపు రూ.8వేల కోట్లు. జగన్‌ పార్టీ పిశాచగణాల ఇసుక మేతల ధాటికి రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలన్నీ సర్వనాశనమయ్యాయి. ఏపీలో రూ.10వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశారని సీనియర్‌ న్యాయవాది లూథ్రా సుప్రీంకోర్టుకు ఇటీవలే విన్నవించారు. మద్యాన్ని నిషేధిస్తానన్న జగన్‌- జనానికి విపరీతంగా తాగబోయించి, ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేసి గల్లాపెట్టెలు నింపుకొన్నారు. నక్క వినయాల వైకాపా అధినేత పట్ల భాజపా అధిష్ఠానం తొలుత కొంత సానుభూతితో వ్యవహరించింది. అదే అదనుగా రాష్ట్రాన్ని కుళ్లబొడిచేశారు జగన్‌మోహన్‌ రెడ్డి. ఆయన నయవంచక నిజరూపం- భాజపా పెద్దలకు క్రమేణా అవగతమైంది. ‘ఏపీలో అభివృద్ధి పనులు జీరో... మొత్తం అంతా అవినీతే’ అన్న ప్రధాని మోదీ ఛీత్కరింపు- వైకాపా దోపిడి రాజ్యం పట్ల తీవ్ర అభిశంసనే!

రాష్ట్రాభివృద్ధి, వాస్తవ జన సంక్షేమంపట్ల దార్శనికత కలిగినవారు పాలకులైతేనే సామాన్యుల బతుకుల్లో వెలుగులు నిండుతాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాధినేతలకు ఉండాల్సిన సద్వివేచన ఏ కోశానా లేని జగన్‌ కారణంగా జనజీవితాలు పెనుచీకట్ల పాలయ్యాయి. ‘చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మిగిలిన వాటికన్నా ముందుకు తీసుకెళ్ళింది. వైకాపా అధికారంలోకి వచ్చి ఆ అభివృద్ధిని పట్టాలు తప్పించింది’ అన్నది ప్రధాని మోదీ పరిశీలనాత్మక వ్యాఖ్య! అనంతపురంలో కియా; విశాఖపట్నం, విజయవాడల్లో సాఫ్ట్‌వేర్‌ సంస్థల   ఏర్పాటు మొదలు గ్రామగ్రామానా సీసీ రహదారుల వరకు తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రగతికి పెద్దపీట దక్కింది. జగన్‌ రూపేణా ఆంధ్రావని నెత్తిన తిష్ఠవేసిన శని ఏమో పారిశ్రామికాభివృద్ధిని పూర్తిగా పొట్టనపెట్టుకుంది. ప్రజల ప్రాణాలను గుంతల రోడ్లకు బలిచ్చింది. ప్రధాని ఆవేదనాత్మకంగా వ్యాఖ్యానించినట్లు, సాగునీరు అందక రాష్ట్ర రైతాంగం ఇక్కట్ల పాలవుతున్నా సరే- పోలవరం ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు పారించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సున్నంపెట్టిన జగన్‌- మూడు రాజధానుల పేరిట ప్రాంతీయ విద్వేషాలను మాత్రం ఎగదోశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను కేంద్రం ఎప్పుడో మంజూరు చేసింది.  దాని ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు స్థలమివ్వని జగన్‌ సర్కారు- ఉత్తరాంధ్రకు అన్నివిధాలుగా వెన్నుపోటు పొడిచింది. జలయజ్ఞాన్ని విధ్వంసం చేసి రాయలసీమను కరవు రక్కసి కోరల్లోకి నెట్టేసింది. వైకాపా గూండాలు, ఖాకీ బట్టల కిరాతకులను రెండు వైపులా పెట్టుకుని రాష్ట్రాన్ని పరమ నిరంకుశంగా పాలించిన జగన్‌- జనం ఆస్తిపాస్తులకు, ప్రాణాలకు రక్షణే లేకుండా చేశారు. అందుకే, ప్రధాని మోదీ పిలుపిచ్చినట్లు- ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన వైకాపా పీడను ప్రజానీకం వదిలించుకోవాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.