అడవిని కాపాడుకుంటేనే... భవిష్యత్తు!

మనిషి కన్నా ముందే పుట్టాయి- అడవులు. నేటికీ జీవకోటి మనుగడకు అవే అమూల్య రక్షాకవచాలు. వాటివల్ల మానవాళికి ఒనగూడే ప్రయోజనాలు లెక్కకు మిక్కిలి. దట్టమైన అరణ్యాలు శీతోష్ణ స్థితిగతుల్ని సమర్థంగా నియంత్రిస్తాయి. ఉద్ధృత జలప్రవాహాల్ని క్రమబద్ధీకరిస్తాయి. భూమాతకు అవే శ్వాసకోశాలు.

Published : 25 May 2024 00:26 IST

నిషి కన్నా ముందే పుట్టాయి- అడవులు. నేటికీ జీవకోటి మనుగడకు అవే అమూల్య రక్షాకవచాలు. వాటివల్ల మానవాళికి ఒనగూడే ప్రయోజనాలు లెక్కకు మిక్కిలి. దట్టమైన అరణ్యాలు శీతోష్ణ స్థితిగతుల్ని సమర్థంగా నియంత్రిస్తాయి. ఉద్ధృత జలప్రవాహాల్ని క్రమబద్ధీకరిస్తాయి. భూమాతకు అవే శ్వాసకోశాలు. అటువంటి అరణ్యాల అడ్డగోలు నరికివేత... పుడమితల్లికి అక్షరాలా కడుపుకోత! దురదృష్టవశాత్తు, తీవ్ర అనర్థదాయక వన విధ్వంసం దేశంలో పెద్దయెత్తున కొనసాగుతోంది. 2000 సంవత్సరం నుంచి ఇండియాలో సుమారు 57లక్షల ఎకరాల విస్తీర్ణంలో వృక్షఛాయ అదృశ్యమైందని ‘గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్‌’ తాజా నివేదిక మదింపు వేసింది. ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తక్షణ స్పందన కోరుతూ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖకు, కేంద్ర కాలుష్య మండలికి, సర్వే ఆఫ్‌ ఇండియాకు నోటీసులు జారీచేసింది! దేశంలో పచ్చని చెట్లపై గొడ్డలి వేటు ఉదంతాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. 2018-2022 మధ్య ఇండియాలో పంట పొలాల్లోని 50 లక్షలకుపైగా భారీ వృక్షాలు నరికివేతకు గురైనట్లు డెన్మార్క్‌ పరిశోధక బృందం ఇటీవలే వెల్లడించింది. అస్సాం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్‌లలో వృక్షఛాయ వేగంగా తరిగిపోతున్నదన్న అధ్యయనాంశాలూ అరణ్యరోదనకు దృష్టాంతాలే. ‘హరిత హారం’ స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా పదేళ్లలో ఏడుశాతం మేర అటవీ విస్తీర్ణం పెరిగిందని నిరుడు అధికారికంగా ప్రకటించారు. అదే తెలంగాణలో అయిదేళ్లలోనే 12లక్షల చెట్ల నరికివేతకు అనుమతించినట్లు మునుపటి ప్రభుత్వం హైకోర్టులో ప్రమాణపత్రం సమర్పించింది. తెలంగాణలో అటవీ శాఖ రికార్డుల ప్రకారం నమోదైన 66.33లక్షల ఎకరాల్లో 22లక్షల ఎకరాల అడవులు ఏమైపోయాయో అంతుచిక్కడం లేదు! ఏ ముఖ్యమంత్రి అయినా జిల్లా పర్యటనలకు వెళ్తే మొక్కలు నాటడం ఆనవాయితీ. ఏపీలో దాన్ని తుడిచిపెట్టిన జగన్మోహన్‌రెడ్డి సర్కారు- సీఎం ఎక్కడికెళ్తే అక్కడ పచ్చని చెట్లను అడ్డంగా నరికేసే భ్రష్టచరిత్ర నెలకొల్పింది. వృక్షాల్ని కాపాడుకుంటే అవి మనల్ని సంరక్షిస్తాయన్న వివేచనపైనే అది గొడ్డలి వేటు!

ఏ దేశంలోనైనా కనీసం 33శాతం వరకు అటవీ విస్తీర్ణం పర్యావరణ సమతూకానికి దోహదపడుతుంది. 1952, 1988 నాటి జాతీయ అటవీ విధానాలు ఆ లక్ష్య సాధనకే ఓటేశాయి. దేశీయంగా ఇప్పటికీ అది 22శాతం లోపేనని అటవీ మంత్రిత్వశాఖ గణాంకాలు చాటుతున్నాయి. బ్రెజిల్‌ 60శాతం, కోస్టారికా 51శాతం హరితావరణంతో విలసిల్లుతుండగా ఇండియాలో వృక్షఛాయ ఆశించినంతగా పెరగకపోవడానికి కారణాలేమిటి? దేశంలో చాలాచోట్ల గనుల తవ్వకం, విద్యుత్‌ కేంద్రాలు, ఆనకట్టలు, పరిశ్రమలు, రహదారుల పేరిట అటవీ భూములను ఇతరత్రా ప్రయోజనాల నిమిత్తం మళ్ళిస్తున్నారు. కొన్నిసార్లు అభివృద్ధి ప్రాజెక్టులకు అది అత్యావశ్యకమైనా- విచక్షణాధికారాల మాటున తీసుకున్న నిర్ణయాలెన్నో వివాదాస్పదమవుతున్నాయి. దట్టమైన అడవుల్ని ఇష్టారాజ్యంగా కొట్టిపారేసేందుకు, బదులుగా ఎక్కడో మొక్కలు నాటడానికి అనుమతించిన ధోరణులు దేశంలో హరితావరణ మందభాగ్యాన్ని స్థిరీకరించాయి! ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ పులుల సంరక్షణ కేంద్రంలో పర్యటకాభివృద్ధి పేరిట పెను విధ్వంసం సృష్టించారని మండిపడ్డ సుప్రీంకోర్టు- ఆ రాష్ట్ర అటవీ మంత్రి రావత్‌ను, మాజీ అధికారి కిషన్‌ చంద్‌ను రెండు నెలల క్రితం బోనులో నిలబెట్టింది. వేలాది వృక్షాల నరికివేతకు అసలు ఎలా అనుమతించారని వారిని కోర్టు సూటిగా నిగ్గదీసింది. ఇతర దేశాల్లో పౌరుల క్రియాశీల భాగస్వామ్యంతో స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో అటవీ పరిరక్షణోద్యమం కొత్తపుంతలు తొక్కుతోంది. దేశీయంగా అటవీ ఛాయ పెంపొందించడానికి తలపెట్టిన కంపా(ప్రత్యామ్నాయ అడవుల పెంపకం), గ్రీన్‌ ఇండియా మిషన్, గ్రీన్‌ క్రెడిట్‌ ప్రోగ్రాం వంటివి కొత్త వివాదాలకు అంటుకడుతున్నాయి. ఏ కారణంగానైనా దట్టమైన అరణ్యాలు తరిగిపోవడం మానవాళికి ఆత్మహత్యా సదృశం. జాతి సంస్కృతిలో వన సంరక్షణ అంతర్భాగమైతేనే పచ్చ‘ధనం’ వర్ధిల్లుతుంది. హరితావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు, జాగృత ప్రజానీకం నిబద్ధమైతేనే... వన సంపద జాతికి పచ్చల హారమవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.