Updated : 19 May 2022 06:17 IST

Azadi Ka Amrit Mahotsav: విభజన ఆగినట్లే ఆగి..

దేశ విభజన జరగాలని జిన్నాలాంటి వారు బలంగా ప్రయత్నిస్తే... దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోవద్దని అంతకంటే బలంగా యత్నించిన నాయకుడు సయ్యద్‌ గులాం మొహియుద్దీన్‌ అహ్మద్‌ బిన్‌ ఖైరుద్దీన్‌ అల్‌ హుసైనీ... ఉరఫ్‌ మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌! అటు బ్రిటన్‌, కాంగ్రెస్‌లనే కాకుండా... కరడుగట్టిన జిన్నాను కూడా ఐక్య భారత్‌కు ఒప్పించిన ఘనుడు ఆజాద్‌! కానీ చివర్లో తాను తీసుకున్న     ఓ ‘ఘోర తప్పుడు నిర్ణయం’తో... పరిస్థితి మారిపోయింది.

ఆధునిక భారత చరిత్రలో 1940-47 మధ్యకాలం అత్యంత కీలకమైంది. రెండో ప్రపంచ యుద్ధం... భారత్‌పై పట్టు సడలించబోతున్నట్లు బ్రిటన్‌ సంకేతాలు... ముస్లిం లీగ్‌ పాకిస్థాన్‌ డిమాండ్‌ ఊపందుకోవటం... జాతీయోద్యమ పతాకస్థాయి.. వెరసి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి అగ్నిపరీక్షగా మారిన తరుణమది! ఆ సమయంలో జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు అబుల్‌కలాం ఆజాద్‌. 1888లో మక్కా (సౌదీ అరేబియా)లో పుట్టి కోల్‌కతాలో స్థిరపడ్డ ఆయన కలం పేరు ఆజాద్‌! మౌలానా అనేది పాండిత్యానికి ప్రతీకగా వచ్చిన గౌరవం.  తల్లిదండ్రులు ఇద్దరూ సంపన్న ఇస్లాం పండితులు! ఆజాద్‌ ఎన్నడూ బడికి పోలేదు. ఇంటివద్దే... అరబిక్‌, బెంగాలీ, ఉర్దూ, పర్షియన్‌, ఆంగ్లాలతో పాటు గణితం, తత్వశాస్త్రం, చరిత్ర, సైన్స్‌ నేర్చుకున్నారు. ఇరాన్‌లోని యంగ్‌టర్క్‌ ఉద్యమంతో ప్రభావితుడైన ఆజాద్‌ ఆంగ్లేయులతో పాటు సంప్రదాయ ముస్లిం నాయకత్వాన్ని కూడా ప్రశ్నించేవారు. బెంగాల్‌ విభజనను వ్యతిరేకించిన ఆయన అరబిందోఘోష్‌ తదితరులతో కలసి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పత్రికను స్థాపించి... ఆంగ్లేయులను వ్యతిరేకిస్తూ, హిందూ ముస్లిం ఐక్యతను కోరుతూ రాసేవారు. తర్వాత ఖిలాఫత్‌ ఉద్యమంతో ... గాంధీకి దగ్గరయ్యారు. 1923లో జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు. విద్య, స్వదేశీ, అహింస అంశాల్లో గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెడుతూ, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి కృషి చేశారు. అలా ఎదిగిన ఆజాద్‌ను 1940లో మళ్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి వరించింది. కాంగ్రెస్‌ అధ్యక్ష హోదాలో పాకిస్థాన్‌ ఏర్పాటు ప్రతిపాదనను ఆజాద్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇది రెండు దేశాలకూ ఏమాత్రం మంచిది కాదని తేల్చిచెప్పారు. ‘‘విభజనతో రెండు దేశాలూ (భారత్‌, పాకిస్థాన్‌) సైనిక సామర్థ్యంపై దృష్టిపెడతాయి. సమాజాభివృద్ధిపై కాదు’’ అంటూ ముందుచూపుతో హెచ్చరించారు. కాంగ్రెస్‌లోని భిన్నవర్గాలను సమన్వయం చేసుకుంటూ... జిన్నాను, పాకిస్థాన్‌ డిమాండ్‌ను ఎదుర్కొంటూ ముస్లింలను కూడా ఐక్య భారత్‌కు ఒప్పించటానికి కృషి చేశారు ఆజాద్‌.

జిన్నాను ఒప్పించి...

1946 మార్చిలో బ్రిటన్‌ ప్రభుత్వం... అధికార మార్పిడిపై చర్చించటానికి కేబినెట్‌ బృందాన్ని పంపించింది. ఐక్య భారత్‌లో ముస్లిం మెజార్టీ ఉన్న ప్రాంతాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందనే సాకు చూపుతూ జిన్నా పాకిస్థాన్‌ ఏర్పాటు కోరాడు. దీనికి ఆజాద్‌ విరుగుడును ప్రతిపాదించారు. బలమైన రాష్ట్రాల వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని... రాష్ట్రాలకు అధికారం ఉంటే... ముస్లిం ప్రాబల్యమున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ముప్పు ఉండదని ఆజాద్‌ వాదించారు. దీనికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీతో పాటు బ్రిటిష్‌ కేబినెట్‌ బృందం సానుకూలత వ్యక్తంజేసింది. దేశ విభజనకు కేబినెట్‌ బృందం విముఖంగా ఉండటంతో... జిన్నా కూడా ఆజాద్‌ ప్రతిపాదనకు అయిష్టంగానే మొగ్గు చూపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే మార్గం లేదంటూ ముస్లింలీగ్‌ నాయకులను ఒప్పించారు. అలా... విభజన ఆగిపోయింది. బలమైన రాష్ట్రాల ఐక్య భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ దశలో... కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు వచ్చాయి. మరోమారు అధ్యక్షుడిగా ఉండటానికి ఇష్టపడని ఆజాద్‌ జవహర్‌లాల్‌ నెహ్రూను తన వారసుడిగా ప్రతిపాదించారు. అధ్యక్ష పదవి చేపట్టిన నెహ్రూ... కేబినెట్‌ బృందం నిర్ణయాలను అవసరం మేరకు పునఃపరిశీలించే అవకాశం లేకపోలేదంటూ వ్యాఖ్యానించారు. దీన్ని సాకుగా తీసుకున్న జిన్నా... మళ్లీ మొదటికి వచ్చి, ఐక్య భారత్‌కు అంగీకరించేదే లేదంటూ ప్రకటించాడు. పాకిస్థాన్‌ డిమాండ్‌ను పునరుద్ధరించాడు. విభజన అనివార్యమైంది. ‘‘అత్యంత కీలకమైన దశలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని మళ్లీ చేపట్టకపోవటం... నెహ్రూకు అప్పగించటం నా రాజకీయ జీవితంలో చేసిన అత్యంత దారుణమైన తప్పిదం. నన్ను నేను క్షమించుకోలేను. ఒకవేళ నేనా తప్పు చేసి ఉండకుంటే...చరిత్ర ఇలా ఉండేది కాదు’’ అని స్వాతంత్య్రానంతరం నెహ్రూ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆజాద్‌ తన జీవిత చరిత్రలో వాపోయారు.


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని