Updated : 23 May 2022 06:32 IST

నిప్పును ఆర్పే రోబోలు!

వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరగడం తరచూ అగ్నిప్రమాదాలకు దారితీస్తోంది. కానీ, నగరాలు, పట్టణాల్లోని ఇరుకు సందుల గుండా వెళ్లి మంటలను ఆర్పడం నానాటికీ కష్టమవుతోంది. మరోవైపు పారిశ్రామికాభివృద్ది వల్ల కర్మాగారాల్లోనూ అగ్ని ప్రమాద ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంటలను ఆర్పడంలోనూ అధునాతన సాంకేతికతలు, రోబోలు రంగప్రవేశం చేస్తున్నాయి. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు సునాయాసంగా వెళ్లి, చిటికెలో మంటలు ఆర్పేయడం వీటి ప్రత్యేకత. దీనివల్ల ఎక్కువ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకముందే మంటలను అదుపులోకి తీసుకురావొచ్చు. దేశంలో తొలిసారిగా దిల్లీ ప్రభుత్వం ఇలాంటి రెండు రోబోలను ప్రవేశపెట్టింది.


ఇందుకే అవసరం..

ఉవ్వెత్తున ఎగిసే అగ్నికీలలను ఎదుర్కోవడం, వాటిని అదుపులోకి తీసుకురావడం సాహసోపేత చర్య. భరించరాని సెగ, ఉక్కిరిబిక్కిరి చేసే పొగను ఎదుర్కోవాలి. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క అమెరికాలోనే సరాసరిన ఏటా 80 మంది ఫైర్‌ ఫైటర్లు ఇలా మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా ఇరుకు సందులు, బహుళ అంతస్తుల భవనాలు, నేలమాళిగలు, గిడ్డంగులు, ఫ్యాక్టరీలు, చమురు, రసాయన ట్యాంకర్లు, అడవుల్లో రేగే మంటలను ఆర్పడం మరీ కష్టం. ఇలాంటిచోట్ల మనుషులకు బదులు రోబోలను రంగంలోకి దించితే ప్రాణ నష్టాన్ని నివారించొచ్చు. ఈ దిశగా కొన్ని దేశాలు ఇప్పటికే ముందడుగు వేశాయి. ఈ అవాంఛనీయ మరణాలను నిరోధించడానికి అగ్నిమాపక రోబోలు అమోఘంగా ఉపకరిస్తాయి. అమెరికా, జపాన్‌, చైనా, ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌, జర్మనీ తదితర దేశాలు అత్యాధునిక అగ్నిమాపక రోబోల తయారీని చేపట్టాయి. ఇవి రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పనిచేస్తాయి. కొన్ని సంస్థలు మరో అడుగు ముందుకేసి ‘మేధో’ అగ్నిమాపక రోబోలను తయారుచేస్తున్నాయి. అవి పరిస్థితులకు అనుగుణంగా సొంతంగా వ్యవహరిస్తాయి.


ఎన్నో ప్రత్యేకతలు..

* దిల్లీలో బరిలో దించిన ఆస్ట్రియా రోబోలను 300 మీటర్ల దూరం నుంచి రిమోట్‌ కంట్రోల్‌తో నడపవచ్చు. ఇవి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదులుతాయి.

* వీటిలో టైర్లు ఉండవు. యుద్ధ ట్యాంకుల తరహాలో ట్రాక్‌ వ్యవస్థ సాయంతో ముందుకు సాగుతాయి. 

* రోబో ముందు భాగంలో సెన్సర్‌, కెమెరా ఉంటాయి. మంటల ఉష్ణోగ్రత స్థాయిని సెన్సర్‌ అంచనా వేసి, అవసరమైనంత మేర నీటిని విరజిమ్ముతుంది. మండుతున్న ఇంట్లో ఎవరైనా చిక్కుకుని ఉంటే రోబోలోని కెమెరాతో వారిని గుర్తించొచ్చు. 

* ఈ అగ్నిమాపక రోబోలు అవసరమైతే కిటికీలను పగులగొట్టి లోనికి ప్రవేశిస్తాయి. ఎత్తయిన భవనాల్లో మెట్లనూ ఎక్కి ప్రమాదస్థలికి చేరుకుంటాయి.

* 140 అశ్వశక్తి గల ఇంజన్‌తో పనిచేసే ఈ యంత్రంలో నీటిని వెదజల్లే నాజిల్స్‌ను అవసరానికి తగ్గట్టు ఎక్కువగానో తక్కువగానో వాడవచ్చు.

* ఈ రోబో 100 మీటర్ల దూరం నుంచి నిమిషానికి 2,400 లీటర్ల నీటిని అధిక పీడనంతో విరజిమ్మి మంటలను ఆర్పేస్తుంది.

* వేడి, పొగ, నిప్పుల సెగను లెక్కచేయకుండా ముందుకు సాగుతాయి. ప్రమాద స్థలంలో లేచే పొగ మేఘాలను రోబోలు తమ వెంటిలేషన్‌ వ్యవస్థ ద్వారా బయటకు లాగేస్తాయి. ఆ వెంటిలేటర్లు రోబోను తీవ్ర వేడిలోనూ చల్లగా ఉంచుతాయి. తన వెనుక భాగంలోని పైపు ద్వారా.. దూరాన ఉన్న ట్యాంకర్ల నుంచి నీటిని ఈ సాధనం తోడుకోగలుగుతుంది.


స్కోడా సాంకేతికత అమోఘం

కార్లను తయారు చేసే స్కోడా కంపెనీ చెక్‌ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలెస్లావ్‌లో ఉన్న తన కర్మాగార అగ్నిమాపక కేంద్రంలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టింది. మంటలను గుర్తించి, సకాలంలో వాటిని ఆర్పగల రోబోలు, నిప్పును పసిగట్టే థర్మల్‌ కెమెరాలు అమర్చిన డ్రోన్లు, దేశంలోనే అతి ఎత్తయిన రిమోట్‌ కంట్రోల్‌ హై లిఫ్ట్‌ వేదికను సిద్ధంగా ఉంచింది. ప్రమాదస్థలికి ఇవి ఐదు నిమిషాల్లోనే చేరుకోగలవు.

* ఈ రిమోట్‌ హైలిఫ్ట్‌ వేదిక 60 మీటర్ల ఎత్తు వరకు వెళ్లగలదు. బహుళ అంతస్తుల భవనాల్లో మంటలను ఆర్పడానికి ఇది ఉపయోగకరం.

* అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దట్టంగా పొగ కమ్ముకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మంటల కేంద్ర స్థానాన్ని కనిపెట్టడం కష్టమవుతుంది. డ్రోన్‌లో అమర్చిన థర్మల్‌ కెమెరా దాన్ని పసిగట్టేస్తుంది. దీనివల్ల నీరు, రసాయనాలను సరైన ప్రదేశంపైకి ప్రయోగించి, మంటలను వేగంగా ఆర్పేయవచ్చు. 

* కర్మాగారాల్లో మంటలు రేగినప్పుడు పేలుళ్లు సంభవించే అవకాశం ఉంటుంది. అలాంటి చోట్లకు మానవులకు బదులు రోబోలను పంపి అగ్నికీలలను అదుపులోకి తీసుకురావచ్చు.


అగ్గి రాజుకోకుండానే..

అగ్ని ప్రమాదం సంభవించకుండా జాగ్రత్తపడటం ఉత్తమం. ఈ లక్ష్యంతోనే స్కోడా సంస్థ తన కర్మాగారంలో 200 థర్మల్‌ కెమెరాలు, నిప్పు రాజుకున్న వెంటనే కనిపెట్టగల 35,000 సెన్సర్లను ఏర్పాటు చేసింది. అవి అందించే సమాచారాన్ని విశ్లేషించి, తగు చర్యలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సూచిస్తుంది.

* లిథియం బ్యాటరీల వల్ల విద్యుత్‌ వాహనాల్లో చెలరేగే మంటలను ఆర్పడానికి కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామనీ, దానిపై ప్రయోగాలు జరుపుతున్నామని స్కోడా తెలిపింది.


- ఈనాడు ప్రత్యేక విభాగం


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని