icon icon icon
icon icon icon

ఆరు గ్యారంటీల్లో అమలైంది ఒక్కటే

‘కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు చెప్పిన 6 గ్యారంటీలు.. 66 హామీలు.. 400కుపైగా వాగ్దానాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మరేదీ అమలు కాలేదు.

Published : 08 May 2024 04:36 IST

రేవంత్‌రెడ్డి మాటకు కట్టుబడరని నాలుగు నెలల్లోనే తేలిపోయింది
రిజర్వేషన్లు వద్దన్నది రాజీవ్‌గాంధీయే
మల్కాజిగిరిలో కాంగ్రెస్‌, భారాసలకు డిపాజిట్లు రావు
మీట్‌ ది ప్రెస్‌లో ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు చెప్పిన 6 గ్యారంటీలు.. 66 హామీలు.. 400కుపైగా వాగ్దానాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మరేదీ అమలు కాలేదు. 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇప్పుడున్న కలుషిత రాజకీయాలను ఎప్పుడూ చూడలేదు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత అబద్ధాలు, పాత పద్ధతి ఉండదు అనుకున్నాం. మళ్లీ అవే పునరావృతమవుతున్నాయి’ అని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శించారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు వేణుగోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్‌రెడ్డి, సభ్యులు హాజరయ్యారు. ఈటల మాట్లాడుతూ ‘‘పాలనలో కేసీఆర్‌ విఫలం కావడానికి చాలా సమయం పట్టింది.. కానీ రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి కాదని నాలుగు నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. రాష్ట్రంలో 7-10 శాతం కమీషన్లు ఇస్తే తప్ప పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం అక్రమాలు, ఫోన్‌ ట్యాపింగ్‌పై తక్షణ చర్యలు ఉంటాయని భావించాను.. కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్లు పడవని హడావుడిగా రైతుభరోసా నిధులు విడుదల చేశారు. గ్యారంటీలు, రైతాంగానికి ఇచ్చిన హామీలనూ విస్మరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి.


అంబేడ్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది..

రిజర్వేషన్లకు భాజపాకు వ్యతిరేకమని చెబుతూ తప్పుడు వీడియోలను సృష్టించి వైరల్‌ చేస్తున్నారు. అబద్ధాల ప్రచారం, మార్ఫింగ్‌ చేయడంలో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను మించిపోయారు. వీపీ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో విద్య, ఉద్యోగ అవకాశాలపై రిజర్వేషన్లకు సంబంధించి కమిటీ వేయగా అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న రాజీవ్‌గాంధీ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు అణగారిన వర్గాల పేరిట ఓట్లు సంపాదించాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది. ఎస్టీ, ఎస్సీల రిజర్వేషన్ల కోసం పోరాడిన అంబేడ్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదే. భాజపా రిజర్వేషన్లకు వ్యతిరేకమైతే అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఎందుకు కల్పిస్తుంది. భారాస, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటెయ్యడం వల్ల వచ్చే లాభం లేదు. భాజపాకు ఓటేస్తే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. మల్కాజిగిరిలో ఏ సర్వే సంస్థలకు అందని ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్‌, భారాస పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కే అవకాశం కూడా లేదు’’ అని ఈటల వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img