icon icon icon
icon icon icon

బతుకుల్ని మార్చనున్న కాంగ్రెస్‌ గ్యారంటీలు

తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ (గ్యారంటీ)లతో మహిళల జీవితాలు మారిపోతాయని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ చెప్పారు.

Updated : 14 May 2024 06:34 IST

తెలంగాణ, కర్ణాటకల్లో ఇప్పటికే ఇది మొదలైంది
వీడియో సందేశంలో సోనియా
మహిళల ఒక్కఓటు ఏటా రూ.లక్షకు సమానం: రాహుల్‌

దిల్లీ: తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ (గ్యారంటీ)లతో మహిళల జీవితాలు మారిపోతాయని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ చెప్పారు. దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం వల్ల మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని, అలాంటి వారందరికీ మహాలక్ష్మి పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘‘స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకొని ఆధునిక భారత నిర్మాణం వరకు మహిళల కృషి మరువలేనిది. అధిక ద్రవ్యోల్బణం వల్ల ఇప్పుడు వారు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. వారి కష్టానికి న్యాయం చేకూర్చేందుకు కాంగ్రెస్‌ విప్లవాత్మక గ్యారంటీతో ముందుకొచ్చింది. మహాలక్ష్మి పథకంతో ప్రతి పేద మహిళకు సంవత్సరానికి రూ.లక్ష లభిస్తాయి’’ అని సోనియా చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే తాము అమలుచేస్తున్న గ్యారంటీల వల్ల అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని సోనియా గుర్తుచేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు, ఆహార భద్రత వంటి విప్లవాత్మక చట్టాల ద్వారా కోట్లమంది భారతీయులకు కాంగ్రెస్‌ పార్టీ సాధికారత కల్పించిందన్నారు. కాంగ్రెస్‌ చిహ్నమైన హస్తం.. ప్రజల పరిస్థితుల్ని మారుస్తుందన్నారు.

భవిత మీ చేతిలోనే: రాహుల్‌

సోనియా సందేశాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు తమ ‘ఎక్స్‌’ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. ‘‘నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న మహిళలకు కాంగ్రెస్‌ మహాలక్ష్మి పథకం సంజీవనిలా పనిచేయనుంది. వారు వేసే ఒక్కఓటు ఏటా రూ.లక్షకు సమానం. ప్రతినెలా ఖాతాల్లో రూ.8,500 జమ అయితే ఆర్థికంగా ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీ కుటుంబ భవిష్యత్తును మీరే నిర్దేశించగలరు. కాంగ్రెస్‌కు ఓటువేసి పరిస్థితుల్ని మార్చుకోండి’’ అని రాహుల్‌ రాసుకొచ్చారు. నాలుగో దశ పోలింగ్‌కు ముందు ఆయన, పార్టీ అధ్యక్షుడు ఖర్గే తమ ఎక్స్‌ ఖాతాల ద్వారా ఓటర్లకు పిలుపునిస్తూ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. కుటుంబాల విధిరాత మార్చడంలో ప్రతిఓటూ కీలకమని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img