icon icon icon
icon icon icon

శాసనసభ్యుల కోట.. చిన్నచింతకుంట

మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం చిన్నదే అయినా విశేషాలు పుట్టెడున్నాయి. ఉభయరాష్ట్రాల్లో పేరుగాంచిన కురుమూర్తి క్షేత్రం ఇక్కడే కొలువై ఉంది. 

Updated : 14 Nov 2023 12:12 IST

కొత్తకోట, చిన్నచింతకుంట, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం చిన్నదే అయినా విశేషాలు పుట్టెడున్నాయి. ఉభయరాష్ట్రాల్లో పేరుగాంచిన కురుమూర్తి క్షేత్రం ఇక్కడే కొలువై ఉంది. పలువురు శాసనసభ్యుల పుట్టినిల్లుగా ఈ మండలం గుర్తింపు పొందింది. 1957లో అమరచింత నియోజకవర్గం ఏర్పడగా.. అమరచింత, చిన్నచింతకుంట, ఆత్మకూరు, దేవరకద్ర, ధన్వాడతో పాటు మక్తల్‌ మండలంలోని కొన్ని గ్రామాలు వచ్చేవి. ఇలా అమరచింత నియోజకవర్గంలో ఉన్న చిన్నచింతకుంట వాసులు ఇప్పటి వరకు ఐదుగురు పలుమార్లు ప్రజాభిమానం పొంది శాసనసభలోకి అడుగుపెట్టారు. శాసనసభ స్థానాల పునర్విభజనలో అమరచింత నియోజకవర్గం పేరు కనుమరుగై దేవరక్రద నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. పలు కొత్త మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి చేరినా తొలి ఎమ్మెల్యేగా అవకాశం చిన్నచింతకుంట వాసులకే దక్కింది.

తొలి ఎమ్మెల్యే సోంభూపాల్‌

అమరచింత సంస్థానాధీశులైన సోంభూపాల్‌ అమ్మాపూర్‌ దొర. 1962లో అమరచింత నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసి గెలుపొంది శాసనసభలోకి అడుగుపెట్టారు. 1967లోనూ ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే రంగంలోకి దిగి కాంగ్రెస్‌ అభ్యర్థి జయలక్ష్మి దేవమ్మపై విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల బరిలో దిగారు. ఎవరూ నామినేషన్‌ వేయక పోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సాధించారు.

స్వర్ణ సుధాకర్‌

నవలా రచయిత్రి స్వర్ణసుధాకర్‌  మోటారు బీడీ పరిశ్రమ యజమాని సుధాకర్‌రెడ్డి సతీమణి. 2004లో ఆమెకు కాంగ్రెస్‌ టికెట్‌ వరించింది. ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి దయాకర్‌రెడ్డిని ఆమె ఓడించారు. ఇదే సమయంలో దయాకర్‌రెడ్డి సతీమణి సీత దేవరక్రద జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిని తెదేపా తరఫున దక్కించుకున్నారు.

ఇస్మాయిల్‌ సేట్‌

బీడీ పరిశ్రమలకు, కార్మికులకు నిలయమైన చిన్నచింతకుంటలో వస్తాద్‌ బీడీ పరిశ్రమ వ్యవస్థాపకులు ఇస్మాయిల్‌ సేట్కు 1983లో అమరచింత నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున బరిలో దిగి విజయం సాధించారు.

సీతాదయాకర్‌ రెడ్డి

కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర నియోజకవర్గంలో చిన్నచింతకుంట మండలం చేరగా దయాకర్‌రెడ్డి సతీమణిగా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పరిచయమైన సీతకు 2009లో తెదేపా అభ్యర్థిత్వం దక్కింది. ఈ ఎన్నికల్లో తెదేపా, తెరాస పొత్తుండగా.. కాంగ్రెస్‌ నుంచి స్వర్ణ సుధాకర్‌ బరిలో దిగారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి దక్కక పోవడంతో రావుల రవీంద్రనాథ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 20 వేల మెజారిటీతో సీతాదయాకర్‌రెడ్డి విజయం సాధించారు. 

దయాకర్‌ రెడ్డి

పర్కాపురం గ్రామంలో ఇల్లు, ఆస్తులు ఉన్న కొత్తకోట దయాకర్‌ రెడ్డి హైదరాబాద్‌లో ఉండేవారు. 1989లో అమరచింత తెదేపా టికెట్‌ ఆయనకు వరించింది. ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పై విజయం సాధించారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో అమరచింత నియోజకవర్గం రద్దయ్యింది. ఇందులోని మండలాలు అటు మక్తల్, ఇటు దేవరకద్ర నియోజకవర్గాల్లో కలిసి పోగా చిన్నచింతకుంట మండలం కొత్తగా ఏర్పాటైన దేవరకద్రలో చేరింది. 2009లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, తెరాస పొత్తులో భాగంగా మక్తల్‌ నియోజకవర్గం తెరాసకు కేటాయించారు. దయాకర్‌రెడ్డి అప్పటికే స్వంతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయగా చివరి క్షణంలో నాటకీయ పరిణామాల మధ్య బీ ఫాం దక్కించుకుని ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు.


ఒకే మండలం.. నలుగురు ఎమ్మెల్యేలు

వనపర్తి వ్యవసాయం, న్యూస్‌టుడే :  ఉమ్మడి గోపాల్‌పేట మండలం నుంచి నలుగురు ఎమ్మెల్యేలయ్యారు. ఇందులో ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా పనిచేయగా.. మరొకరు ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. 

నాగం జనార్దన్‌రెడ్డి: నాగపూరు గ్రామానికి చెందిన నాగం జనార్దన్‌రెడ్డి 1985లో తెదేపా తరఫున మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2004, 2009లో తెదేపా తరఫున విజయం సాధించారు. 2012లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తెదేపా పాలనలో పలు శాఖల మంత్రిగా పనిచేశారు. 

డి.కిరణ్‌కుమార్‌ : శానాయిపల్లి గ్రామానికి చెందిన డి.కిరణ్‌కుమార్‌ సాంఘిక సంక్షేమ వసతి గృహం అధికారిగా విధులు నిర్వహిస్తూ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. అచ్చంపేట రిజర్వ్‌ నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

జిల్లెల చిన్నారెడ్డి : జయన్నతిరుమలాపురం గ్రామానికి చెందిన జిల్లెల చిన్నారెడ్డి 1989లో వనపర్తి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004, 2014ఎన్నికల్లో వనపర్తి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 

గువ్వల బాలరాజు : పొలికెపాడు గ్రామానికి చెందిన గువ్వల బాలరాజు 2009లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img