icon icon icon
icon icon icon

Priyanka Gandhi: మా ‘యువరాజు’ పాదయాత్ర చేశాడు.. మరి ఈ చక్రవర్తి?: మోదీపై ప్రియాంక ఫైర్‌

Priyanka Gandhi: ప్రధాని మోదీ కోటలో ఉండే చక్రవర్తి అని, ఆయనకు సామాన్యుల కష్టాలు ఎలా తెలుస్తాయని కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. 

Published : 04 May 2024 17:17 IST

అహ్మదాబాద్‌: తన సోదరుడు, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై ప్రధాని మోదీ (PM Modi) చేసిన ‘యువరాజు’ విమర్శలకు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) దీటుగా బదులిచ్చారు. తమ యువరాజు దేశ ప్రజల కోసం 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటూ ‘జోడో యాత్ర’ను గుర్తు చేశారు. మోదీని చక్రవర్తిగా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు.

గుజరాత్‌లోని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొన్నారు. ఈసందర్భంగా బనస్కంత లోక్‌సభ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. అధికారం కోసం గుజరాత్‌ ప్రజలను ఉపయోగించుకున్న ప్రధాని.. ఇప్పుడు వారిని మర్చిపోయారని దుయ్యబట్టారు.

డబ్బుల్లేవ్‌.. పోటీ చేయను: టికెట్‌ వెనక్కి ఇచ్చిన కాంగ్రెస్‌ నాయకురాలు

‘‘నా సోదరుడిని ఆయన (మోదీని ఉద్దేశిస్తూ) యువరాజు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆయనకు నేనో విషయం చెప్పాలి. ఇదే యువరాజు.. సామాన్యుల సమస్యలను వినేందుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. రైతులు, కూలీలను కలిసి వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. మరీ ఈ చక్రవర్తి మోదీజీ.. కోటలోనే నివసిస్తున్నారు. ఆయనను మీరెప్పుడైనా టీవీలో చూశారా? దుస్తులు, జుట్టు చెక్కు చెదరకుండా రాజులా కన్పిస్తారు. అలాంటి వ్యక్తికి మీ కష్టం, మీ సమస్యలు ఏం అర్థమవుతాయి? అందుకే మనమంతా ద్రవ్యోల్బణంతో బాధ పడుతున్నాం’’ అని ప్రియాంక విమర్శించారు.

ప్రధాని హోదాలో ఉండి ఆయన అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకురాలు మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌ 55 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఏ రోజైనా మీ మంగళసూత్రాలను, ఆస్తులను పార్టీ దోచుకుందా? ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి దిగజారి ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం దిగ్భ్రాంతికరం’’ అని ప్రియాంక మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img