icon icon icon
icon icon icon

PM Modi: అవినీతిలో కాంగ్రెస్‌, భారాసది ఫెవికాల్ బంధం: ప్రధాని మోదీ

ఇప్పటి వరకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమేనని ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు.

Updated : 08 May 2024 13:49 IST

వేములవాడ: ఇప్పటి వరకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమేనని ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ భాజపా, ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందన్నారు. ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దింపిందని వ్యాఖ్యానించారు. సభ ప్రారంభానికి ముందు  శ్రీరాజరాజేశ్వరస్వామిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

‘‘దక్షిణ కాశీ భగవానుడు శ్రీరాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చాను. మీ ఓటు వల్లే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. కాంగ్రెస్‌ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. వ్యవసాయాన్ని ఆధునికీకరించి లాభసాటిగా మార్చాం. ఆ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించాం. టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేశాం. రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నాం. 

భారాస ప్రభావం మచ్చుకైనా కనిపించట్లేదు

కరీంనగర్‌లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమైంది. ఇక్కడ భారాస ప్రభావం మచ్చుకైనా కనిపించట్లేదు. కాంగ్రెస్‌, భారాసలకు కుటుంబమే తొలి ప్రాధాన్యత.. భాజపా మాత్రం దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ‘కుటుంబం వల్ల.. కుటుంబం చేత.. కుటుంబం కోసం..’ ఈ నినాదంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. భారాస, కాంగ్రెస్‌ రెండూ ఒకటే.. నాణేనికి బొమ్మాబొరుసులాంటివి. అవి అవినీతి పార్టీలు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని కాలరాశాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల కలలు సాకారమవుతాయని అందరూ భావించారు. కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి కుటుంబ లబ్ధి కోసమే భారాస పనిచేసింది. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్‌ కూడా కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసింది. వంశపారంపర్య రాజకీయాలతో దోపిడీ చేసింది. మాజీ ప్రధాని పీవీని కూడా ఆ పార్టీ అవమానించింది. ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్‌ కార్యాలయంలోకి అనుమతించలేదు. పీవీకి భారతరత్న ప్రకటించి భాజపా గౌరవించింది. దేశానికి ఆయన చేసిన సేవ ఎంతో ఉన్నతమైంది. పీవీ కుటుంబంలోని మూడు తరాల సభ్యులను కలిశాను. వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నా.

దేశవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌’ ట్యాక్స్‌పైనే చర్చ

అవినీతిలో కాంగ్రెస్‌, భారాసది ఫెవికాల్ బంధం. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. తెరవెనుక మాత్రం అవినీతి సిండికేట్‌గా మారుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపించింది.. అధికారంలోకి వచ్చాక ఆ అవినీతిపై దర్యాప్తు చేయట్లేదు. తెలంగాణ నుంచి దిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ ట్యాక్సుపైనే చర్చ జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కంటే ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లు మించిపోయాయి. తెలంగాణలోని ఆర్‌ లూటీ చేసి.. దిల్లీలోని ఆర్‌కు ఇస్తున్నారు. వారి ఆటను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు’’ అని మోదీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img