బైడెన్‌ ప్రమాణస్వీకారం.. ఆసక్తికర విషయాలు

మరికొన్ని గంటల్లో అమెరికా నూతన అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్‌ భవనంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. గతేడాది నవంబర్‌ 3న జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌పై 78ఏళ్ల

Updated : 20 Jan 2021 17:11 IST

మరికొన్ని గంటల్లో అమెరికా నూతన అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్‌ భవనంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. గతేడాది నవంబర్‌ 3న జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌పై 78ఏళ్ల బైడెన్‌ ఘన విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజల సమక్షంలో ప్రమాణం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..

* ప్రస్తుతం దేశాధ్యక్షులుగా ఎన్నికైన వారంతా వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌ భవనంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కానీ, అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ మాత్రం రెండు చోట్ల ప్రమాణం స్వీకారం చేశారు. 1789లో తొలి అధ్యక్షుడిగా ఎన్నికైన వాషింగ్టన్‌ ఏప్రిల్‌ 30న న్యూయార్క్‌ సిటీలోని ఫెడరల్‌ హాల్‌లో బాల్కానీలో నిలబడి ప్రమాణం చేశారు. రెండోసారి అధ్యక్షుడిగా 1973 మార్చి 4న ఫిలడెల్ఫియాలోని కాంగ్రెస్‌ హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

* అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ సంపన్నుడే. 50వేల ఎకరాల భూమికి ఆసామి. కానీ, ఆయన బ్యాంక్‌ ఖాతాలో గానీ, చేతిలో గానీ ఎప్పుడూ డబ్బు ఉండేది కాదు. దీంతో తొలిసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తన స్నేహితుల వద్ద కొంత డబ్బు అప్పు తీసుకొని న్యూయార్క్‌ వచ్చారట. 

* మరో అధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌ క్యాపిటల్‌ భవనానికి నడుచుకుంటూ వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. తన పార్టీ నిరాడంబరతను చాటి చెప్పడం కోసం న్యూజెర్సీ ఎవెన్యూ నుంచి నడుచుకుంటూ వచ్చారట. ఆయన 1801 నుంచి 1809 వరకు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకుముందు 1797 నుంచి 1801 వరకు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

* అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని 1925లో తొలిసారిగా రేడియోలో ప్రసారం చేశారు. అప్పుడు అధ్యక్షుడిగా కెల్విన్‌ కూలిడ్జ్‌ ప్రమాణం చేశారు. 1949లో టెలివిజన్‌లో తొలిసారి ప్రసారం కాగా.. అప్పుడు 33వ దేశాధ్యక్షుడిగా హ్యారీ ఎస్‌. ట్రుమన్‌ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు.

* జనవరి 20న క్యాపిటల్‌ భవనంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయడం సంప్రదాయం. కానీ, లిండన్‌ బి. జాన్సన్‌ ఒక్కరే విమానంలో ప్రమాణం చేశారు. 1961లో జాన్‌ ఎఫ్‌. కెన్నడీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, 1963 నవంబర్‌ 22న ఆయన హత్యకు గురయ్యారు. దీంతో ఆ సమయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న లిండన్‌ బి. జాన్సన్‌.. కెన్నడీ పార్థీవదేహాన్ని చూసేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌లో బయలుదేరి అందులోనే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

* 1997 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బిల్‌ క్లింటన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా వెబ్‌ ఆధారంగా ప్రత్యక్షప్రసారం జరిగింది ఈ క్లింటన్‌ ప్రమాణ స్వీకారోత్సవమే.

* రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన బరాక్‌ ఒబామా నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. 2009 జనవరి 20న ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ప్రమాణం చేయించడంలో ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్‌ కొన్ని తప్పులు చేశారు. దీంతో మరుసటి రోజు ఒబామా మళ్లీ ప్రమాణం చేయాల్సి వచ్చింది. 2013లో ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ప్రమాణ స్వీకారం చేసే తేదీ ఆదివారం రావడంతో కార్యక్రమాన్ని 21కి మార్చారు. కానీ, 20న ఆఫీస్‌లో ముఖ్యమైన అధికారుల సమక్షంలో ఒబామా అధ్యక్షుడిగా ప్రమాణం చేసి.. 21న ప్రజల ముందు మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

* ప్రస్తుతం జనవరి 20న మాత్రమే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరుగుతోంది. అంతకుముందు మార్చి 4న జరిగేది. పలు ఇబ్బందులు, అభ్యంతరాలు ఎదురవ్వడంతో 20వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రమాణ స్వీకారోత్సవాన్ని జనవరి 20కి మార్చారు. 1937లో ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ తొలిసారి జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు.

* 1789లో జరిగిన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో జార్జి వాషింగ్టన్‌ అత్యల్పంగా 135 పదాలతో ప్రసంగించగా.. 1841లో విలియమ్‌ హెన్రీ 10వేల పదాలతో ప్రసంగించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే విలియమ్‌‌ అనారోగ్యంతో కన్నుమూశారు.

* తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న జో బైడెన్‌ అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన అధ్యక్షుడిగా రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం ఆయన వయస్సు 78. అంతకుముందు ఈ రికార్డు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఉండేది. 2017లో అధ్యక్షుడిగా ప్రమాణం చేసే సమయంలో ట్రంప్‌ వయస్సు 70 ఏళ్లు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి..

ఒక్క అధ్యక్షుడు.. ఆరు అధ్యక్ష భవనాలు..!

ప్రమాణ స్వీకార విందు.. ఏమున్నాయంటే..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని