ఈసారి నోబెల్‌ విజేతల బహుమతెంతో తెలుసా!

అంతర్జాతీయంగా పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే నోబెల్‌ పురస్కారం నగదు బహుమతిపై ఆ ఫౌండేషన్‌ కీలక ప్రకటన చేసింది. విజేతలకు ఇచ్చే నగదు బహుమతిని 1 మిలియన్‌ క్రౌన్లు పెంచనున్నట్లు.......

Published : 25 Sep 2020 00:59 IST

స్టాక్‌హోం: అంతర్జాతీయంగా పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే నోబెల్‌ పురస్కారం నగదు బహుమతిపై ఆ ఫౌండేషన్‌ కీలక ప్రకటన చేసింది. విజేతలకు ఇచ్చే నగదు బహుమతిని 1 మిలియన్‌ క్రౌన్లు పెంచనున్నట్లు ఫౌండేషన్‌ వెల్లడించింది. దీంతో ఇక నోబెల్‌ బహుమతికి ఎంపికయ్యే విజేతలు 10 మిలియన్‌ క్రౌన్లు (దాదాపు రూ.3 కోట్లు) నగదు బహుమతిగా పొందుతారని నోబెల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు లార్స్‌ హీకెన్‌స్టెన్‌ వెల్లడించారు.

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫౌండేషన్‌ ఖర్చులు, మూలధనం స్థిరంగా ఉన్నాయని, అందుకే నగదు బహుమతి పెంపు నిర్ణయం తీసుకున్నామని హీకెన్‌ స్టెన్‌ తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి అక్టోబర్లో నోబెల్‌ బహుమతి విజేతలను ప్రకటించనున్నారు. గతేడాది భారత్‌కు చెందిన ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీకి నోబెల్‌ బహుమతి వరించిన విషయం తెలిసిందే. పేదరిక నిర్మూలనకు గానూ ఆయన అర్థశాస్త్రంలో చేసిన విశేష కృషికి ఈ బహుమతికి ఎంపికయ్యారు.

నోబెల్‌ బహుమతిని ప్రముఖ రసాయనవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ 1901లో ప్రారంభించారు. రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, శాంతి, సాహిత్యం, వైద్య, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ బహుమతికి ఎంపిక చేస్తారు. మొదట్లో విజేతలకు 1,50,000 క్రౌన్లు ఇచ్చేవారు. 1981లో అది 1 మిలియన్‌ క్రౌన్లకు చేరుకుంది. క్రమంగా 1980 నుంచి 1990 మధ్య కాలంలో అది కాస్తా 9 మిలియన్‌ క్రౌన్లకు చేరింది. అనంతరం 2000 సంవత్సరంలో 10మిలియన్‌ క్రౌన్లు చేశారు. అయితే 2008 సమయంలో సంక్షోభం ప్రభావంతో 8 మిలియన్‌ క్రౌన్లకు కుదించారు. తిరిగి 2017లో 9 మిలియన్‌ క్రౌన్లకు పెంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని