Hyderabad: ప్రేమోన్మాది దాడి ఘటన.. నిలకడగా సంఘవి ఆరోగ్యం

ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది దాడి గాయపడిన హోమియో వైద్య విద్యార్థిని సంఘవి ఆరోగ్యం.. ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Updated : 04 Sep 2023 21:10 IST

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన హోమియో వైద్య విద్యార్థిని సంఘవి ఆరోగ్యం.. ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కత్తిగాట్లకు గురైన ఆమెను కుటుంబసభ్యులు తమ ఆస్పత్రిలో చేర్చినట్టు ఏఐజీ ఆస్పత్రి తెలిపింది. తక్షణమే స్పందించి ఏఐజీ అత్యవసర విభాగం, న్యూరో, ఆర్థో సహా వివిధ విభాగాల వైద్యులు బాధితురాలికి చికిత్స అందించినట్లు తెలిపింది. సంఘవి ముఖంపై ఉన్న కత్తిగాట్లకు కుట్లు వేసినట్టు పేర్కొంది. బాధితురాలి వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో.. శరీరంలో కీలక నాడులు దెబ్బతిన్నాయని తెలిపింది. 

ఈ ఘటనపై స్పందించిన ఏఐజీ ఆస్పత్రి ఛైర్మెన్ నాగేశ్వర్ రెడ్డి.. బాధితురాలికి పూర్తి అండగా ఉంటామన్నారు. సంఘవి పూర్తి వైద్య ఖర్చులు ఆస్పత్రి భరిస్తుందని చెప్పారు. వెన్నెముక గాయానికి సంబంధించి అవసరమైన శస్త్ర చికిత్సలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు. అయితే, సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం హేయమన్నారు.

నిందితుడికి రిమాండ్‌

ఈ దాడి కేసులో నిందితుడు శివకుమార్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రంగారెడ్డి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం శివకుమార్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని