APSRTC: ప్రభుత్వానికి మా ఓట్లు కావాలంటే ఓపీఎస్‌ అమలు చేయాల్సిందే: ఎన్‌ఎంయూఏ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం ఎన్‌ఎంయూఏ డిమాండ్ చేసింది.

Published : 06 Oct 2023 22:20 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ఆర్టీసీ సిబ్బందికి చెందిన నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ) డిమాండ్ చేసింది. ప్రభుత్వంలో ప్రజా రవాణాశాఖ ఉద్యోగులుగా విలీనమైన ఆర్టీసీ సిబ్బందికి చెందిన ప్రధాన సంఘాలైన నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ), ఎంప్లాయీస్‌ యూనియన్‌లకు ప్రభుత్వం తరఫున గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంయూఏ ఆధ్వర్యంలో విజయవాడలో విజయోత్సవ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎంయూఏ నేతలు మాట్లాడుతూ.. ‘‘గుర్తింపుతో వజ్రాయుధం చేతికి వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు కోల్పోయినవి సాధించుకునేందుకు పోరాడతాం. ఇక పోరాడాలి. విలీనం తర్వాత ఉద్యోగులకు ఇచ్చే 38 రకాల ప్రోత్సాహకాలు తీసేశారు.  పాత పెన్షన్‌ విధానం కోసమే విలీనం కోరుకున్నాం. పీఆర్‌సీ, సెలవుల బకాయిలు రూ.850 కోట్లు వెంటనే చెల్లించాలి.  ప్రభుత్వానికి మా ఓట్లు కావాలంటే ఓపీఎస్‌ అమలు చేసి తీరాల్సిందే. డిపోలో టూల్స్‌ లేవు. మెకానిక్‌లు లేరు. సిబ్బంది లేరు. పని ఒత్తిడితో డ్రైవర్లు, కండక్టర్లు ప్రాణాలు విడుస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ఈహెచ్‌ఎస్‌ కార్డులు పనిచేయడం లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు అపరిమిత వైద్య సేవలు కల్పించాలి’’ అని యూనియన్‌ నేతలు డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని