CM Jagan: అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి: సీఎం జగన్‌ ఆదేశం

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Published : 20 Apr 2023 18:10 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమశాఖలో ఉన్న ఖాళీలనూ భర్తీ చేయాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలలో నాడు-నేడు పనుల ప్రగతిపై సీఎం ఆరా తీయగా.. ఫౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా మారిన సుమారు 10వేలకుపైగా అంగన్‌వాడీల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన సుమారు 45వేల అంగన్‌వాడీలలోనూ ప్రాధాన్యత క్రమంలో పనులు చేయాలని సీఎం నిర్దేశించారు. 

పింఛన్లు తరహాలోనే సంపూర్ణ పోషణ పంపిణీ..

ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై ప్రతిపాదనలు తయారుచేసి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గ్రోత్‌ మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. పింఛన్లు తరహాలోనే సంపూర్ణ పోషణ పంపిణీని సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ సెంటర్లను పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీల్లో సూపర్‌ వైజర్లపైన పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని సీఎం ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని