పోర్నోగ్రఫీకి నేరాలకు సంబంధమేంటి?

ఆన్‌లైన్‌లో బూతు వీడియోలు చూడటం వల్ల హాని జరుగుతుందని చెబితే, కొంతమంది ఏది బూతు అనీ, నిజానికి అశ్లీలమనేదేదీ లేదని, అంతా చూసేవారి కోణంలో ఉంటుందని వాదిస్తుంటారు. ఏది పోర్నోగ్రఫీ.. ఏది కాదనే దగ్గరే చాలామందికి సందేహాలు ఉంటాయి.

Updated : 22 Jul 2021 06:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌లో బూతు వీడియోలు చూడటం వల్ల హాని జరుగుతుందని చెబితే, కొంతమంది ఏది బూతు అనీ, నిజానికి అశ్లీలమనేదేదీ లేదని, అంతా చూసేవారి కోణంలో ఉంటుందని వాదిస్తుంటారు. ఏది పోర్నోగ్రఫీ.. ఏది కాదనే దగ్గరే చాలామందికి సందేహాలు ఉంటాయి. పోర్నోగ్రఫీ వల్ల పెద్దగా కీడేమీ లేదనీ, అశ్లీలతను ప్రశ్నించడమే హిపోక్రసీ అని కొంతమంది అంటుంటారు. కానీ శృంగారం, అశ్లీలం రెండూ వేర్వేరనేది వారు గుర్తించట్లేదు. మనిషిని ఉన్నతంగా మార్చేది మంచిదనీ, దిగజార్చేదంతా చెడ్డదనే సంగతి గుర్తుంచుకుంటే చాలు. భారత శిక్షా స్మృతిలో ఇన్‌డీసెంట్‌, అబ్సీన్‌ అనే పదాలు వాడారు. ఇతరుల్లో వికార భావాలను, ఉద్రేకాలను రెచ్చగొట్టేదంతా సరైనది కాదని తేల్చి చెప్పారు. మహిళల స్థాయిని దిగజార్చేలా, అవమానకరంగా, ప్రజల నైతికతకు భంగం కలిగించేలా చిత్రీకరణ చట్ట ప్రకారం శిక్షార్హమని చెప్పారు. 

నేరాలకు పోర్నోగ్రఫీకి లంకె!

మహిళలు ఒళ్లంతా కనిపించేలా, రెచ్చగొట్టేలా దుస్తులు ధరించడం వల్లనే అత్యాచారాలు జరుగుతుంటాయని కొంతమంది వాదిస్తుంటారు. మరి ముసలమ్మలు, ఐదారేళ్ల చిన్నపిల్లలపై జరిగే దాడులకు వారు వేసుకునే దుస్తులే కారణమా? అని ఎదురు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతారు. కానీ సమాజంలో చాలామంది అంగీకరించే ఓ వాస్తవమేమంటే పోర్నోగ్రఫీకి అలవాటు పడటం వల్ల వ్యక్తుల్లో విపరీతమైన కామోద్రేకం పెరుగుతుందని, పశువుల్లాగా తయారవుతారనీ. మనదేశంలో నిర్భయ ఉదంతం తర్వాత కేంద్ర ప్రభుత్వం మహిళలపై నేరాల గురించి వేసిన శ్రీకృష్ణ కమిషన్‌ నివేదికలోనూ పోర్నోగ్రఫీ, మద్యం, మాదక
ద్రవ్యాలను కట్టడి చేయాలని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పింది.  క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌లో చేయాల్సిన మార్పులకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  జస్టిస్‌ వి.ఎస్‌.మాలతి నేతృత్వంలో రెండు దశాబ్దాల కింద వేసిన కమిటీ కూడా మహిళలు, పిల్లలపై నేరాలకు కారణమైన బూతు వీడియోలను కట్టడి చేయాలని సూచించింది.  అశ్లీల, హింసాత్మక వీడియోలు పదేపదే చూడటం వల్ల చాలామంది సున్నితత్వాన్ని కోల్పోతారనీ, అలాంటి సంఘటనలు బయట ఎక్కడ జరిగినా వాటిని తేలికగా తీసుకుంటారని, వాటిపై పెద్దగా స్పందించరనేది కూడా అనేకసార్లు రుజువైంది.

 వివిధ అధ్యయనాలు ఏమని తేల్చాయి?

కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలోని సైకియాట్రి విభాగానికి చెందిన డా. వలెరీ వూన్‌ ప్రకారం పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డ వ్యక్తుల మెదళ్లలో బూతు చిత్రాలు చూస్తున్నప్పుడు ఆరోగ్యకరమైన నియంత్రణ గల వ్యక్తుల్లో కంటే భిన్నమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాంటి మార్పులే డ్రగ్స్‌ వాడేవారిలోనూ కనిపిస్తాయి. కాబట్టి పోర్నోగ్రఫీ తప్పకుండా హాని చేస్తుందని ఆమె చెప్పారు.  బూతు చిత్రాలకు అలవాటు పడ్డవారి మెదడులో మూడు విభిన్న భాగాల్లో చాలా తేడాలను గుర్తించామని చెప్పారు.  వూన్‌ ప్రకారం ఇదో వ్యసనం లాగా తయారై, రోజురోజుకూ మరింత ఎక్కువగా అలాంటి వీడియోలను, చిత్రాలను చూడాలని తహతహలాడతారు. దీనివల్ల కొందరు తమ వైవాహిక బంధంలో కష్టాలు కొని తెచ్చుకుంటారు. పని చేసేచోట పోర్న్‌ వీడియోలు చూసి ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు.  చాలామంది తమకిది అలవాటయిందని గుర్తించాక, దీని నుంచి బయటపడేందుకు సాయం కోరడానికి కూడా సిగ్గుపడతారు. కాలిఫోర్నియా లాస్‌ఏంజెలెస్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ నెయిల్‌ మాలమత్‌ ప్రకారం మహిళలపై దౌర్జన్యం చేయడానికి పురిగొల్పేవాటిలో పోర్నోగ్రఫీ కూడా ఒకటి. 1980 నుంచి 2009 వరకు ప్రచురితమైన అనేక అధ్యయనాల్లో  ప్రమాదకరమైన ఆలోచనలు, ప్రవర్తనకు పోర్నోగ్రఫీ కారణమవుతుందని వెల్లడైంది. ఇదివరకే దురుసుగా ప్రవర్తించేవారు పోర్నోగ్రఫీకి అలవాటుపడితే వారిలోని దౌర్జన్యపూరిత ప్రవృత్తి మరింత గాడి తప్పుతుంది. బూతును చూడటానికి అలవాటు పడటం కూడా మద్యం, డ్రగ్స్‌లాంటి వ్యసనమేనని ఎన్నో అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 

2015లో హెచ్చరించిన బ్రిటీష్‌ సీనియర్‌ జడ్జ్‌

తనకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించమని 23 ఏళ్ల హంతకుడు రెనాల్డ్స్‌  చేసుకున్న అప్పీల్‌ను తిరస్కరిస్తూ, 2015లో బ్రిటీష్‌ సీనియర్‌ జడ్జ్‌  లార్డ్‌ థామస్‌ ఓ ప్రకటన చేశారు. తన స్నేహితురాలు 17 ఏళ్ల జార్జియాను చంపేందుకు ముందు రెనాల్డ్స్‌ పోర్న్‌ వీడియోలను చూస్తున్నాడనీ, ఆన్‌లైన్‌ పోర్నోగ్రఫీ వల్ల మనుషుల్లో అసహజమైన, వక్ర ప్రవర్తన రీతులు పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. బ్రిటన్‌లో చిన్న పిల్లలపై లైంగికదాడులు, హత్యలకు పాల్పడిన నేరస్థులు పోర్నోగ్రఫీకి బాగా అలవాటుపడినట్లు అనేక కేసుల్లో రుజువైంది. బూతును చూడటానికి అలవాటుపడినవారిలో అసహజ లైంగిక కోరికలు, ఫాంటసీలు కూడా చెలరేగుతుంటాయని అనేక దేశాల్లోని నేరపూరిత సంఘటనలు తెలియజేస్తున్నాయి. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts