Monkeypox: కామారెడ్డి వాసికి మంకీపాక్స్‌ లక్షణాలు.. స్పందించిన ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

 రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్‌ లక్షణాలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గర్తించిన విషయం తెలిసిందే.

Updated : 25 Jul 2022 13:38 IST

హైదరాబాద్: రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్‌ లక్షణాలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గర్తించిన విషయం తెలిసిందే. బాధితుడు ప్రస్తుతం హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీనిపై తాజాగా ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శంకర్‌ స్పందించారు.

డా.శంకర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో మంకీ పాక్స్ అనుమానిత కేసు కామారెడ్డి ఏరియా ఆస్పత్రి నుంచి వచ్చింది. బాధితుడు కువైట్ నుంచి ఈ నెల 6వ తేదీన వచ్చారు. తొలుత జ్వరం.. మూడు రోజుల తర్వాత శరీరంపై దద్దుర్లు కనిపించాయి. దీంతో కామారెడ్డిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి ముందుగా వెళ్లారు. అవి మంకీపాక్స్‌ లక్షణాలుగా అక్కడి వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉంది. కొంత జ్వరం ఉంది. శరీరంపై ఉన్న దద్దుర్లు మంకిపాక్స్ లక్షణాల్లాగే కనిపిస్తున్నాయి. రోగి నుంచి 5 రకాల నమూనాలు సేకరించాం. వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించాం.

బాధితుడితో కాంటాక్ట్‌ అయిన ఆరుగురిని గుర్తించి కామారెడ్డిలోనే ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. బాధితుడికి అతి దగ్గరగా ఉన్న వారికి మాత్రమే మంకీపాక్స్‌ సోకేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి. గాలి ద్వారా మంకిపాక్స్ సోకదు. పెద్దగా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి  కొంత మేర రక్షణ ఉండేందుకు ఆస్కారం ఉంది. మంగళవారం సాయంత్రానికి బాధితుడి వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారి శరీరంపై దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి’’ అని డా.శంకర్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని