జవాను ఇల్లు ధ్వంసం.. రంగంలోకి బీఎస్‌ఎఫ్‌

దేశరాజధాని దిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో ఓ జవాను ఇంటి ధ్వంసం కావడంపై బీఎస్‌ఎఫ్‌ అధికారులు వేగంగా స్పందించారు. బీఎస్‌ఎఫ్‌కు చెందిన జవాను కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ముందడుగు వేశారు.

Published : 01 Mar 2020 00:59 IST

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో ఓ జవాను ఇంటి ధ్వంసం కావడంపై బీఎస్‌ఎఫ్‌ అధికారులు వేగంగా స్పందించారు. బీఎస్‌ఎఫ్‌కు చెందిన జవాను కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ముందడుగు వేశారు. దిల్లీలోని ఖాస్‌ ఖజురీ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అనీస్‌, 2013లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా చేరాడు. ప్రస్తుతం అనీస్‌ పశ్చిమబెంగాల్‌లోని మారుమూల ప్రాంతమైన రాధాబారిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల దిల్లీలో సీఏఏ విషయంలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఆందోళనకారులు ఆయన ఇల్లును పూర్తిగా తగలబెట్టేశారు. దీంతో ఇంట్లో ఉన్న అతడి తండ్రి మునీస్‌, ఇతర కుటుంబసభ్యులు మిలిటరీ సిబ్బంది సాయంతో బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. 

ఈ విషాద ఘటన గురించి అనీస్‌ కనీసం తన తోటి సిబ్బందికి సైతం తెలియజేయకపోవడం గమనార్హం. ఈక్రమంలో వార్తల ద్వారా విషయాన్ని తెలుసుకున్న అధికారులు సత్వరం వారికి సాయం అందించేందుకు బీఎస్‌ఎఫ్‌ ప్రతినిధులను అతడి తండ్రి మునీస్‌ వద్దకు పంపించారు. దీనిపై బీఎస్‌ఎఫ్‌ డీజీ వివేక్‌ జోహ్రీ మాట్లాడుతూ.. జవాన్‌ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు, ఇల్లు నిర్మాణం కోసం సహకరిస్తామని చెప్పారు. ఇంజనీర్‌ను పంపి నష్టంపై అంచనా వేయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మూడు నెలల్లో వివాహం చేసుకోబోతున్న అనీస్‌కు ఈ సాయం బహుమతిగా ఉంటుందని చెప్పారు.  మరోవైపు బీఎస్‌ఎఫ్‌ సంక్షేమ నిధి నుంచి సోమవారం రూ.5లక్షలు చెక్కు అందజేయనున్నారు. పెళ్లి ముహూర్తం లోపు వారు నష్టపోయిన ఆస్తిని తిరిగి పొందేందుకు సాయం చేయాలని బీఎస్‌ఎఫ్‌ అధికారులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని