మానవాళి హితం కోసమే ఆ రిస్కు

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కరోనా టీకాపై నిర్వహించిన తొలిదశ మానవ ప్రయోగాలు విజయవంతం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రిస్కుకు వెరవకుండా ..

Updated : 22 Jul 2020 09:40 IST

అందుకు డబ్బు కూడా తీసుకోలేదు 
 ప్రయోగాత్మక టీకాతో దుష్ప్రభావాలేమీ తలెత్తలేదు
ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ కరోనా వ్యాక్సిన్‌ వాలంటీర్‌ దీపక్‌ వెల్లడి 

దిల్లీ: బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కరోనా టీకాపై నిర్వహించిన తొలిదశ మానవ ప్రయోగాలు విజయవంతం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రిస్కుకు వెరవకుండా ఈ టీకా పరీక్షల్లో పాల్గొన్న వాలంటీర్లు ఇందులో ముఖ్య భూమిక వహించారు. అలాంటివారిలో భారత సంతతికి చెందిన దీపక్‌ పాలివాల్‌ కూడా ఉన్నారు. ఈ ప్రయోగం కోసం డబ్బు తీసుకోకుండా, ఉచితంగా సేవలు అందించి తన ఉదాత్తతను చాటుకున్నారు. ‘‘నా ప్రమేయం వల్ల ఏదైనా మంచి జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది’’ అని ఆయన ‘ఈటీవీ భారత్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ప్రయోగం వల్ల తన ప్రాణానికి ముప్పు కలగొచ్చని తనకు తెలుసని, అయితే మానవాళి సంక్షేమం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ యజ్ఞంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

జైపుర్‌ మూలాలున్న దీపక్‌ ప్రస్తుతం లండన్‌లోని ఒక ఔషధ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ‘‘కరోనా వైరస్‌ను నిరోధించే టీకాను మానవులపై ప్రయోగించే కసరత్తు ప్రారంభం కాబోతోందని ఓ స్నేహితుడి ద్వారా తెలుసుకున్నా. వాటిలో పాల్గొనాలని నిర్ణయించుకొని, ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకున్నా. ఈ విషయాన్ని జైపుర్‌లోని నా కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. వారికి తెలిస్తే నన్ను ఈ ప్రయోగానికి అనుమతించబోరన్న ఉద్దేశంతో విషయాన్ని వారి దృష్టికి తీసుకురాలేదు’’ అని ఆయన తెలిపారు. ఈ పరీక్షల్లో పాల్గొన్నందుకు డబ్బు తీసుకోకపోవడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘వాలంటీరు అంటే స్వచ్ఛందమని అర్థం. డబ్బు తీసుకుంటే సామాజిక సేవ ఉద్దేశం దెబ్బతింటుంది’’ అని పేర్కొన్నారు.
త్వరలోనే వస్తుంది : ఈ ప్రయోగం వల్ల తన శరీరంలో అసాధారణ అంశాలేవీ తలెత్తలేదని దీపక్‌ తెలిపారు. ఎలాంటి దుష్ప్రభావాలూ ఉత్పన్నం కాలేదన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ నిర్వహించిన మూడు దశల ప్రయోగాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయని, అందువల్ల ఈ టీకా త్వరలోనే మార్కెట్‌లోకి రావచ్చని చెప్పారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు.

ప్రయోగం రోజున..: తనపై టీకా ప్రయోగం మే 11న జరిగిందని దీపక్‌ చెప్పారు. ‘‘ఓ వాలంటీరు చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో.. ప్రయోగానికి ముందు రోజు నా మనసులో ఓ మూల భయం తలెత్తింది. ప్రయోగానికి ముందు వైద్యులు నాకు కొన్ని వీడియోలు చూపారు. వెనక్కి తగ్గాలనుకుంటే వెళ్లిపోవచ్చని చెప్పారు. పరీక్షలో పాల్గొనడం తప్పనిసరేమీ కాదన్నారు. అయినా వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నా. దీంతో వైద్యుడు నాకు టీకా ఇంజెక్షన్‌ వేశారు. 2 గంటల పాటు నన్ను పరిశీలనలో ఉంచారు. ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తాయా అన్నది గమనించారు. ఆ తర్వాత నిశితంగా పరీక్షలు చేసి, ఇంటికి పంపేశారు’’ అని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని