నాడు విన్నారు...ఆనక వదిలేశారు

సుదీర్ఘ కాలంగా రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించిన చాగల్లు జైపూర్‌ చక్కెర కర్మాగారం చాలాకాలం క్రితం మూతపడింది. రైతులకు సుమారు రూ.32 కోట్ల బకాయిలు యాజమాన్యం చెల్లించింది.

Updated : 24 May 2023 06:23 IST

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం గాలికి
నేడు కొవ్వూరులో సీఎం జగన్‌ పర్యటన
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం, గోపాలపురం, నిడదవోలు

‘‘ప్రతిపక్ష నాయకుడిగా గతంలో మీరు మా ప్రాంతంలో పర్యటించినప్పుడు అనేక సమస్యలు విన్నారు.. నేను ఉన్నానని భరోసా ఇవ్వగానే ఎంతో సంతోషించాం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ పరిష్కారమవుతాయని ఆశించాం. నాలుగేళ్లు దాటినా అతీగతి లేదు’’

- కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల ప్రజల ఆవేదన ఇది. వేల ఎకరాలకు నీరందించే లిఫ్టు కాలువలు, అనేకమందికి ఉపాధి చూపే కర్మాగారాలు వంటివి ఇందులో ఉన్నాయి. జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా బుధవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొవ్వూరు వస్తున్న నేపథ్యంలో తమ దీర్ఘకాలిక సమస్యలను మళ్లీ ఇక్కడి ప్రజలు గుర్తుచేస్తున్నారు.  


సుదీర్ఘ కాలంగా రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించిన చాగల్లు జైపూర్‌ చక్కెర కర్మాగారం చాలాకాలం క్రితం మూతపడింది. రైతులకు సుమారు రూ.32 కోట్ల బకాయిలు యాజమాన్యం చెల్లించింది. తమ ఉపాధి, మిగిలిన బకాయిల కోసం కార్మికులు అలు పెరగని పోరాటం చేస్తున్నారు. ఎన్నికల ముందు (2019లో) నియోజకవర్గానికి వచ్చిన జగన్‌కు అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థిని, నేటి హోంశాఖా మంత్రి తానేటి వనిత, స్థానిక నాయకులతో కలిసి ఇబ్బందులను వివరించారు. ఇప్పటికీ అక్కడి పరిస్థితిలో మార్పులేదు.


కాలువే ఆధారమనుకుంటే..

తాడిపూడి లిఫ్టు-5 కాలువ ఇది. దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో సుమారు 12 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నిధులు కేటాయించడంతో పనులు చేపట్టారు. తరువాత వచ్చిన తెదేపా ప్రభుత్వం 75 శాతం పూర్తి చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటికే పూర్తయిన ప్రాంతాలకు సాగునీరు అందించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పనుల ఊసే లేకుండా పోయింది. బిల్లులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు నిలుపుదల చేసి వెళ్లిపోయారు. ఆ కాలువ మీద ఆధారపడే రైతులు పలుమార్లు విన్నవించుకున్నా పరిష్కారం లేదు.


ఆర్వోబీ.. అంతా రివర్స్‌ టెండరింగ్‌

నిడదవోలులో అసంపూర్తిగా ఆర్వోబీ పనులు

నిడదవోలులోని ఆర్వోబీ నిర్మాణ పనులపై రివర్స్‌ టెండరింగ్‌ ప్రభావం పడింది. 2019 జనవరి 7న అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ.201 కోట్లు మంజూరు చేయగా ఇందులో రూ.56 కోట్లు రైల్వే, రూ.145 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిర్ణయించారు. రైల్వే పరిధిలో పనులు పూర్తయ్యాయి. రాష్ట్రం పరిధిలో జరగాల్సిన పని ఈ ప్రభుత్వం వచ్చాక ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల భూసేకరణకు సంబంధించి నిర్వాసితులకు నగదు జమ చేశారు. కేంద్రం అందించే సీఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రూ.197 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడు ప్రకటించినా పనులు ప్రారంభం కాలేదు.


ఎత్తిపోతల.. ఎన్నాళ్లిలా

గోదావరి జలాలను ఎత్తి కాలువ ద్వారా 4.80 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి గత ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టారు. రూ.4,900 కోట్లతో కాలువలు, మూడు ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని భావించారు. తాడిపూడి వద్ద గోదావరి నీటిని తోడి కొంత దూరం పైపులు, మరికొంత దూరం కాలువ ద్వారా గుడ్డిగూడెం వరకు వచ్చాక లిప్టు ఏర్పాటు చేశారు. రౌతుగూడెం వద్ద మరో ఎత్తిపోతలతో 120 కి.మీ. పొడవున నీరు పంపించేలా చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక కాలువ పనులు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని