CocaCola - KTR: తెలంగాణకు కోకాకోలా మరిన్ని పెట్టుబడులు.. మంత్రి కేటీఆర్‌తో వెల్లడి

తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోకాకోలా సంస్థ (Coca-Cola Company) నిర్ణయించింది. తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌ (Minister KTR)కు వెల్లడించింది.

Updated : 26 Aug 2023 10:32 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోకాకోలా సంస్థ (Coca-Cola Company) నిర్ణయించింది. తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌ (Minister KTR)కు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివి సమావేశమయ్యారు. తమ సంస్థకు భారత్‌ మూడో అతిపెద్ద మార్కెట్‌ అని, తమ కార్యకలాపాలను విస్తరించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు జేమ్స్‌ చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు వివరించారు. 

సిద్దిపేట ప్లాంట్‌కు మరో రూ.647 కోట్లు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ వద్ద సంస్థకు ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణకు గతంలోనే రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామన్నారు. దీనికి అదనంగా సిద్దిపేట జిల్లా (Siddipet)లో రూ.1,000 కోట్లతో నూతన బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణానికి.. ఏప్రిల్ నెల 22న తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో రూ.647 కోట్లను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్‌లో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్ డిసెంబర్ 24లోగా పూర్తి అవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

కరీంనగర్ లేదా వరంగల్‌లో..!

దీంతోపాటు రెండో నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రకటించింది. కరీంనగర్ (Karimnagar) లేదా వరంగల్ (Warangal) ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రతిపాదిత నూతన తయారీ ప్లాంట్ పెట్టుబడితో కలిపి దాదాపుగా రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులను.. తెలంగాణలో పెట్టినట్లు అవుతుందని కోకాకోలా సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. 

మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు

కోకాకోలా తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండో తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనడానికి తాజాగా కోకాకోలా సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని