స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకే లక్ష్యంగా..

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. పట్టణాల్లో ఏర్పాటుచేసిన ప్రజా శౌచాలయాలు సహా మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల సమర్థ నిర్వహణతో మంచి ర్యాకులు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది....

Published : 17 Feb 2021 23:06 IST

ప్రత్యేక శ్రద్ధ చూపాలని పురపాలకశాఖ ఆదేశం

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. పట్టణాల్లో ఏర్పాటుచేసిన ప్రజా శౌచాలయాలు సహా మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల సమర్థ నిర్వహణతో మంచి ర్యాకులు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా నిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని అధికారులను పురపాలక శాఖ ఆదేశించింది. మార్చిలో చేపట్టనున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో తెలంగాణ పేరును నిలబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 40 పట్టణాలకు ఓడీఎఫ్‌+ గుర్తింపు ఉంది. జీహెచ్‌ఎంసీ, గ్రేటర్‌ వరంగల్‌, కరీంనగర్‌ కార్పొరేషన్లతోపాటు వికారాబాద్‌, నల్గొండ, నిర్మల్‌ మున్సిపాలిటీలకు ఓడీఎఫ్‌++ గుర్తింపు ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 68 పట్టణాల్లో తనిఖీలు పూర్తికాగా.. 22 పట్టణాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రంలో పురపాలకశాఖ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని పట్టణాల్లో దాదాపు 8 వేలకు పైగా ప్రజా మరుగుదొడ్లు, మహిళల కోసం షీ టాయిటెట్లు నిర్మించింది. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను మొబైల్‌ టాయిలెట్లుగా మార్చింది. మరుగుదొడ్ల నిర్వహణకు అధికారులు సమగ్ర క్యూఆర్‌ కోడ్‌ విధానం అమలు చేస్తున్నారు. మానవ వ్యర్థాల శుద్ధి కోసం ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల అవి ప్రారంభం కాగా, మరికొన్ని చోట్ల అవి పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజా శౌచాలయాలు నిర్మించినా.. చాలా చోట్ల వాటి నిర్వహణలో లోపాలతో ఓడీఎఫ్‌+, ఓడీఎఫ్‌++ హోదా పొందడంలో విఫలమవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఆ ప్రభావం స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులపై పడకుండా ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని సదుపాయాలు కల్పించడం సహా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ చేపట్టాలని సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని