హైదరాబాద్‌ అతలాకుతలం..ఫొటోగ్యాలరీ

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో రెండు రోజులుగా వర్షం కురుస్తుండగా.. ఆ ప్రభావం తెలంగాణతో పాటు హైదరాబాద్‌పైనా పడింది.

Updated : 31 Oct 2023 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. తెలంగాణ సహా హైదరాబాద్‌లో కుంభవృష్టికి‌ జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వరదనీరు రోడ్లపై మోకాలిలోతు వరకు నిలిచిపోవడంతో జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. జాతీయ రహదారులతో పాటు నగరంలోని ప్రధాన రోడ్లు చెరువులను తలపించేలా వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. ముఖ్యంగా వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు ఇళ్లకు చేరుకోలేక ఇబ్బందులు పడ్డారు. నగరంలోని ఖైరతాబాద్‌, టోలీచౌకి, సికింద్రాబాద్‌, బోరబండ, అంబర్‌పేట, ముసారాంబాగ్‌, ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌ మెట్‌ ప్రాంతాల్లో భారీగా వరదనీరు ప్రధాన రహదారులపైకి చేరింది. ముందు జాగ్రత్తగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. భారీ వర్షం ప్రభావంతో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

హైదరాబాద్‌-విజయవాడ రాకపోకలు బంద్‌

వర్షం ప్రభావంతో అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రెండు చెట్లు కూలిపోవడంతో కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన ఓ వాహనం ధ్వంసమైంది. నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్‌ మండలం ఇనాంగూడ వద్ద జాతీయ రహదారిపై వర్షపునీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జాతీయ రహదారి వెంబడి  పలుచోట్ల వరదనీరు ప్రవహిస్తుండటంతో హైదరాబాద్‌- విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు షాద్‌నగర్‌- శంషాబాద్‌ మార్గంలో కిలోమీరట్ల మేర వాహనాలు బారులు తీరాయి. వరద ప్రభావంతో రోడ్డు పూర్తిగా మునిగి నగరంలోని నిజాంపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. వనస్థలిపురంలోని ఆగమయ్య నగర్‌, బ్యాంక్‌ కాలనీ, హకీంబాద్‌, సాయినాథ్‌కాలనీ, గణేశ్‌ నగర్‌లో ఇళ్లలోని వర్షపు నీరు చేరింది. టోలీచౌకి నదీమ్‌ కాలనీలో ప్రజలను విపత్తు నిర్వహణ బృందాలు పునరావాస కేంద్రాలకు తరలించాయి. ముసారాంబాగ్‌ వంతెన వద్ద ప్రమాదకర స్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలను అలీకేఫ్‌ మీదుగా మళ్లిస్తున్నారు.

ఫొటో గ్యాలరీ 2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని