Hyderabad Rains: ఇంకా తేరుకొనేలేదు.. హైదరాబాద్‌కు మళ్లీ అతి భారీ వర్ష సూచన

తెలంగాణలోని పలు చోట్ల ఇవాళ కూడా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Updated : 27 Jul 2023 11:55 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు చోట్ల ఇవాళ కూడా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌లో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని.. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం పలు జిల్లాలో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేడు రెడ్ అలర్ట్.. శుక్రవారం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

గచ్చిబౌలి-లింగంపల్లి మార్గాల్లో వాహనాల మళ్లింపు

హైదరాబాద్‌లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్‌లోని మింట్ కాంపౌండ్ రహదారి, ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్, ఖైరతాబాద్ ప్రధాన రహదారిలోని మెట్రో స్టేషన్ వద్ద భారీగా నీరు నిలిచింది. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో.. వాహనదారులు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. లింగంపల్లి రైల్వే అండర్‌ పాస్‌ వద్దకు భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి-లింగంపల్లి మార్గాల్లో వాహనాలను మళ్లించారు.

రహదారులన్నీ జలమయం 

సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, అల్వాల్, తిరుమలగిరి జవహర్‌నగర్‌, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మూసారాంబాగ్‌ వంతెన వద్ద మూసీ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. వంతెన అంచుకు వరదనీరు చేరింది. సికింద్రాబాద్‌లోని మనోహర్ థియేటర్ సమీపంలో మోకాళ్ల తోతులో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది రంగంలోకి సహాయక చర్యలు చేపడుతున్నారు.

జలదిగ్బంధంలో మోరంచపల్లి.. చెట్లపైకి ఎక్కి తలదాచుకుని..?

ఇళ్లలోకి వర్షపు నీరు

ఎల్బీనగర్ పరిధి నాగోల్ డివిజన్‌లోని అయ్యప్పకాలనీలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. సాగర్ రింగ్ రోడ్డులో భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హస్తినాపురం సమీపంలోని ఓంకార్ నగర్ బస్టాప్‌ సమీపంలోకి వరద నీరు చేరింది. 

నీట మునిగిన వాహనాలు

బషీర్‌బాగ్‌ లా కాలేజీ రహదారి, వంతెన కిందకు భారీగా వర్షం నీరు నిలిచింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల పక్కన నిలిపిన వాహనాలు నీట మునిగాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని