Andhra News: ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ.. ప్రాజెక్టులకు భారీగా వరద

వరద ఉద్ధృతితో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలశయాల గేట్లన్నీ ఎత్తివేయడంతో కృష్ణ నది బిరబిరా పరుగులు పెడుతుంది. జలాశయం

Updated : 13 Aug 2022 21:37 IST

అమరావతి: వరద ఉద్ధృతితో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలశయాల గేట్లన్నీ ఎత్తివేయడంతో కృష్ణ నది బిరబిరా పరుగులు పెడుతుంది. జలాశయం వద్ద జలసవ్వడితో సందడి నెలకొంది. ఎగువ నుంచి కొనసాగుతున్న భారీ వరదతో కృష్ణమ్మ ఉరకలేస్తోంది. దీంతో శ్రీశైలం జలశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3.63లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

 శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది. జలాశయంలో ప్రస్తుత పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 212.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జలాశయం 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3.76 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌వైపు పరుగులు పెడుతున్నాయి. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 62,277 క్యూసెక్కుల నీరు సాగర్‌లో కలుస్తున్నాయి. 

ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండిన నాగార్జున సాగర్‌ జలశయానికి శ్రీశైలం నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహన్ని అధికారులు దిగువకు పంపుతున్నారు. సాగర్‌ 26 గేట్ల ద్వారా 3.58 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 586.4 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 302.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

దిగువన ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి 3.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 3.57 లక్షల క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ ఫ్లో 3.43 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ నుంచి 14,500 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని