Kamareddy: రైస్‌ మిల్‌ సిబ్బందిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే గోవర్ధన్‌

రైస్‌మిల్‌ సిబ్బందిపై కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చేయి చేసుకున్నారు. దీంతో ఆయన వివాదంలో చిక్కుకున్నట్లయింది.

Updated : 06 May 2023 16:26 IST

బిక్నూర్‌: కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ వివాదంలో చిక్కుకున్నారు. బిక్నూర్‌ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలోని పూర్ణిమ రైస్‌మిల్‌లో పనిచేసే సిబ్బందిపై ఆయన చేయి చేసుకోవడమే వివాదానికి కారణమైంది. 

ఇంతకీ ఏం జరిగిందంటే?

గత కొద్ది రోజులుగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైస్‌మిల్లులో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమస్య ఉందని గత కొన్ని రోజులుగా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌ రైస్‌మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కచ్చితంగా ధాన్యాన్ని మిల్లుల్లో దించుకోవాలని రైస్‌మిల్లర్లకు ఆదేశించారు. దీనిపై రైస్‌మిల్లర్లు స్పందిస్తూ.. ఆదేశాల ప్రకారమే ధాన్యాన్ని దించుకుంటాం.. కాకపోతే దీనికి కొన్ని సమస్యలున్నాయని, అధిగమించడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.

ఈ క్రమంలోనే రైస్‌మిల్లర్లు తమ ధాన్యాన్ని దించుకోవట్లేదని ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు అక్కడి రైతులు ఫోన్‌ చేసి చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. పూర్ణిమ రైస్‌మిల్‌కు వెళ్లారు. ధాన్యాన్ని ఎందుకు తీసుకోవట్లేదని సిబ్బందిని ప్రశ్నించారు. దీనికి సిబ్బంది చెప్పిన సమాధానం నచ్చకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి లోనయ్యారు. ఆ కోపంలోనే రైస్‌ మిల్‌ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  ఎమ్మెల్యే వైఖరి కారణంగా ఒకవేళ రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని మొత్తానికే దించుకోకపోతే రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉందన్నారు. మరో వైపు ఎమ్మెల్యే  బేషరతుగా క్షమాపణ చెప్పాలని రైస్‌ మిల్లర్లు డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని