కేసీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా.. ‘కోటి వృక్షార్చన’!

తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతున్న ..

Updated : 07 Feb 2021 13:30 IST

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వినూత్న కార్యక్రమం

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతున్న సీఎం సంకల్పానికి మద్దతుగా ఆ రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు సంతోష్ కుమార్, మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి..
ఆకుపచ్చ తెలంగాణను ఆకాంక్షిస్తున్న ముఖ్యమంత్రి ఆశయాలు ప్రతిబించించేలా ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 17న మూడు మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌కు ఇచ్చే పుట్టినరోజు కానుక అన్నారు. ప్రతి గ్రామం యూనిట్‌గా సర్పంచ్ నేతృత్వంలో అన్ని చోట్లా ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని.. పంచాయితీ రాజ్, అటవీశాఖలతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కేటీఆర్ కోరారు. కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌ను కేటీఆర్, మంత్రులు అభినందించారు. ఆరేళ్ల హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని.. ఎంపీ సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా పచ్చదనం పెంపులో అన్ని వర్గాలను జాగృతం చేస్తోందని మంత్రులు అన్నారు.

పాల్గొన్నవారికి ‘వనమాలి’ బిరుదు
రాష్ట్రం, దేశం పచ్చగా మారాలన్న సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్  చేపట్టిన కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.సీఎం జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరినీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదు ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది. ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన సెల్ఫీ ఫోటోలను ప్రత్యేక యాప్‌లో అప్ లోడ్ చేయాలని నిర్వాహకులు సూచించారు. కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు ఈ-మెయిల్ లేదా మొబైల్ కు వారం రోజుల్లో చేరుతుందని తెలిపారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని