Job Hunt: సినిమా సీన్‌ని తలపించేలా ఉద్యోగ వేట!

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌ సర్‌! సినిమాల్లోనే కాదు.. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూసే నిరుద్యోగుల పరిస్థితి ఇదే!

Updated : 08 Dec 2022 19:54 IST

(credits: linkedin)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌ సర్‌! సినిమాల్లోనే కాదు.. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూసే నిరుద్యోగుల పరిస్థితి ఇదే! ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా కాలం కూడా కలిసి రావాలి కదా! కరోనా కారణంగా ఎదురైన ఆర్థిక సంక్షోభం ఉన్న ఉద్యోగావకాశాల తలుపులకు తాళం వేసింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో నిరుద్యోగులు ఉన్నారు. ఈ సమస్య కేవలం భారతదేశంలోనే కాదు, విదేశాల్లోనూ వీడని నీడలా వెంటాడుతోంది. కానీ, అలాంటి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నాడు ఉద్యోగవేటలో ఉన్న ఆ వ్యక్తి. కట్‌ చేస్తే రెండు వారాల్లో టాప్‌ కంపెనీలో చేరాడు. అసలిది ఎలా సాధ్యమైందంటే.. మనం ఒక్కసారి లండన్‌కి వెళ్లాల్సిందే!

అతని పేరు హైదర్‌ మాలిక్‌. వయస్సు 24. లండన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయమైన మిడిల్‌సెక్స్‌లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగంలో ఫస్ట్‌ క్లాస్‌ డిగ్రీ పొందాడు. ఆపై కొలువు కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నో జూమ్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. కానీ, ఆ వేదికలేవీ తన నైపుణ్యాలు చూపించే అవకాశాలివ్వలేదు. దీంతో విసుగెత్తిపోయిన ఆ యువకుడు చేసిన ఆలోచనే ఇప్పుడు వార్తల్లో నిలిచేలా చేసింది. ఇందుకు స్ఫూర్తి తన నాన్నే అని చెబుతాడు మాలిక్‌ . మాలిక్‌ వాళ్ల నాన్న పేరు మహ్మద్‌ మాలిక్‌. టీనేజీ వయసులోనే పాకిస్థాన్‌ నుంచి బ్రిటన్‌కు వచ్చి ఇప్పుడు క్యాబ్‌ డ్రైవర్‌గా రిటైర్‌ అయ్యారు. 

వేట మొదలైందిలా!

మాములుగా అయితే అందరూ తమ వ్యక్తిగత, చదువు, వివరాలు కలిగి ఉన్న సీవీలను(curriculum vitae- CV) సంస్థలకు మెయిల్‌ చేస్తారు. ఆ సీవీ మెచ్చి కంపెనీ నుంచి తిరిగి మెయిల్‌ వస్తే ఇంటర్వ్యూకు హాజరవుతారు. అందరూ చేసేది ఇదే! అయితే ఈ పద్ధతి అనుసరించి అలసిపోయిన మాలిక్‌ ముందుగా ఒక స్టేషనరీ షాపునకు వెళ్లి అక్కడో వైట్‌ బోర్డ్‌, మార్కర్‌ కొన్నాడు. ఆ బోర్డ్‌పై ఇలా రాసుకొచ్చాడు. ‘‘నేను బీఎస్సీ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో ఫస్ట్‌ క్లాస్‌ గ్రాడ్యుయేట్‌ని. ఎంట్రీ లెవల్‌ రోల్‌ గ్రాడ్యుయేట్‌ స్కీమ్‌ జాబ్‌ కోసం ఎదురుచూస్తున్నా. నా లింక్డిన్‌, సీవీ వివరాలు కావాలంటే ఇక్కడ మీకు కనిపించే లింక్డిన్‌, సీవీ క్యూర్‌ కోడ్స్‌ స్కాన్‌ చేయండి. ఇందులో మీకు సందేహం వచ్చినా.. మీరు నాతో చాట్‌ చేయొచ్చు.. సలహాలు ఇవొచ్చు’’ అని ఓ ట్యూబ్‌ స్టేషన్‌ దగ్గర ఈ బోర్డ్‌ పెట్టాడు. దీంతో స్టేషన్‌లో అటుగా వెళ్లేవారి దృష్టి అటువైపు మళ్లింది.

ఆ 10నిమిషాలు.. నెర్వస్‌ ఫీల్‌ అయ్యా!

‘‘ఇలా చేసిన మొదటి ఐదు పది నిమిషాలు చాలా నెర్వస్‌ ఫీలా అయ్యా! ఎందుకంటే నా చేతిలో చిల్లిగవ్వ లేదు. నా సీవీ కాపీలన్నీ నా బ్యాగ్‌లో ఉన్నాయి. అలా ఖాళీ చేతులతో అటుగా వెళ్లే జనాలను చూస్తూ ఉన్నా. ఎవరైనా నాతో మాట్లాడితే బాగుండని ఆశతో నిరీక్షించా. నన్ను చూసిన చాలా మంది వాళ్ల విజిటింగ్‌ కార్డ్స్‌ ఇచ్చారు. కొందరైతే వాళ్ల ఫోన్‌ నంబర్లు ఇచ్చి నాతో మాట్లాడారు. కానీ ఇవేవి నాకు బ్రేక్‌ ఇవ్వలేదు.’’

ఆ ఒక్క పోస్ట్‌తో జీవితం మారిందిలా..

(credits: linkedin)

చివరికి నేను రాసిన దాన్ని ఇమ్మాన్యుయేల్‌ అనే వ్యక్తి తన లింక్డిన్‌(Linkedin)లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయింది. ‘‘అందరికీ శుభోదయం.. ఈ ఉదయం ఆఫీస్‌కి వెళ్తుండగా.. ఈ జెంటిల్‌మెన్‌ ఉద్యోగవేటలో ఉండటం చూశా. ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలనుకుంటే దయచేసి అతడిని సంప్రదించండి. అవును మనం కష్టసమయాల్లో ఉన్నాం. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు అంతగా లేవు. గ్రాడ్యుయేట్స్‌ ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక్క ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతున్నారు. నిజాయతీగా చెప్పాలంటే కొన్ని ఉద్యోగాలకు అసలు డిగ్రీతోనే సంబంధం లేదు. నిరుద్యోగులకు కావాల్సిందల్లా ఒక ‘అవకాశం’ మాత్రమే. దయచేసి లింక్డిన్‌ కమ్యూనిటీ వాళ్లందరూ ఈ పోస్ట్‌ను షేర్‌ చేస్తారని ఆశిస్తున్నా!’’ అంటూ పెట్టారు. ఇదే మాలిక్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. మరుసటి రోజు ఉదయం 7గంటలకు స్టేషన్‌కు చేరుకున్నాడు. 9.30గంటలకు ఫోన్‌ తెరిచి చూస్తే ఓ మెసేజ్‌. ‘ కానరీ వార్ఫ్ గ్రూప్’లో ట్రెజరీ అనలిస్ట్‌ కోసం 10.30 గంటలకు ఇంటర్వ్యూకి రండి అని ఉంది. కారులో వెళ్దామంటే అది పార్కింగ్‌లో ఉండిపోయింది. దీంతో బోర్డ్‌తో పాటు ఇతర సామాగ్రిని అలాగే పట్టుకొని ఇంటర్వ్యూకు హాజరయ్యాడు! అలా స్టేషన్‌లో బోర్డు పెట్టిన మూడు రోజుల పాటు మాలిక్‌ ఫోన్‌ నాన్‌ స్టాప్‌గా రింగ్‌ అవుతూనే ఉందట. లింక్డిన్‌లో అవకాశాలు వెల్లువెత్తాయి. నవంబర్‌2న ప్రారంభమైన ఈ ఉద్యోగవేట.. కట్‌చేస్తే నవంబర్‌ 16న ఉద్యోగంలో చేరాడు. ‘‘ ఈ పద్నాలుగు రోజుల్లో ఏదైనా జరగొచ్చు. ఇదంతా సాధ్యమైనందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇకపై అందరం కలిసి ఎదుగుదాం’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు మాలిక్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని