వైకల్యాన్ని జయించి.. పారాలింపిక్స్‌కు సన్నద్ధం

హిమాలయాలకు సైకిల్‌పై వెళ్లాలన్నది అతడి కల. ఒలింపిక్స్‌లో సత్తా చాటాలన్నదే ఆశయం. ఆ దృఢ సంకల్ప బలం ముందు వైకల్యం తల వంచక తప్పలేదు.

Published : 08 Oct 2020 23:50 IST

తిరువనంతపురం: హిమాలయాలకు సైకిల్‌పై వెళ్లాలన్నది అతడి కల. ఒలింపిక్స్‌లో సత్తా చాటాలన్నదే ఆశయం. ఆ దృఢ సంకల్ప బలం ముందు వైకల్యం తల వంచక తప్పలేదు. అతడి గుండె నిబ్బరానికి దాసోహమైన సైకిల్‌ పెడల్‌ ఒంటి కాలు కింద ఒరిగిపోయి కొండలు, లోయల్లో చక్కర్లు కొట్టిస్తోంది. ఆత్మస్థైర్యానికి నిదర్శనంగా నిలిచిన ఆ కేరళ యువకుడి కథేంటో ఓసారి తెలుసుకుందాం.

20ఏళ్ల వయసు, 14 శస్త్ర చికిత్సలు, రోజుకు 30మాత్రలు, అంతంత మాత్రం పని చేసే కిడ్నీలు. కానీ అవేవీ అతడిని నిరుత్సాహ పర్చలేదు. పారాలింపిక్స్‌లో సత్తాచాటేందుకు ఒంటి కాలితో సిద్ధమవుతున్నాడు కేరళ కుర్రాడు శ్యామ్‌కుమార్. తిరువనంతపురం బేయాడ్‌కు చెందిన శ్యామ్‌కుమార్‌ 3 కిడ్నీలతో జన్మించాడు. జన్యు లోపం వల్ల అతడి కుడికాలు వెనక భాగంలో కలిసిపోయింది. 8ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ కాలును వేరు చేయాల్సి వచ్చింది. అప్పటికే శ్యామ్‌ మూత్రపిండాలు పాక్షికంగా పని చేస్తున్నాయి. వీటికి తోడు పేదరికం. అయితే ఇవేవీ అతడిని ప్రభావితం చేయలేకపోయాయి. జీవితంలో ముందుకు సాగాలన్న శ్యామ్‌ సంకల్ప బలం ముందు జన్యులోపాలు ఓడిపోయాయి. అతడు తన శరీర ఆకృతికి సరిపోయేలా కృత్రిమ కాలును అమర్చుకున్నాడు. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీ చదువుతున్న శ్యామ్‌ ఆ కాలు సాయంతోనే కళాశాలకు సైకిల్‌పై వెళ్లేవాడు. రోజూ సమీపంలో ఉన్న కొండలు, లోయల్లో సుమారు 20కిలోమీటర్ల మేర చక్కర్లు కొడుతూ ఉండేవాడు. కృత్రిమ కాలు  మరమ్మతులకు గురైన సమయంలో ఒంటికాలుతోనే సైకిల్‌ తొక్కేవాడు. నిరంతర సాధనతో సైక్లింగ్‌పై పట్టు సాధించాడు శ్యామ్‌. ఆ అనుభవంతోనే పారాలింపిక్స్‌లో దేశం తరఫున సత్తా చాటాలనుకుంటున్నాడు. ఎప్పటికైనా ప్రజాదరణ పొందే సైక్లింగ్‌ స్టార్‌ కావాలన్నదే తన ఆశయమని చెబుతున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని