KTR: ‘అమరరాజా’ రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయం: మంత్రి కేటీఆర్‌

అమర రాజా గ్రూపునకు చెందిన అమర రాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుక ముందుకొచ్చింది. దీనిపై శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Updated : 02 Dec 2022 16:21 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా సంస్థ ముందుకొచ్చింది. విద్యుత్‌ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అమరరాజా సంస్థతో హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండీ గల్లా జయదేవ్‌, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, టీఫైబర్‌ ఎండీ, సీఈఓ సుజయ్‌, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమరరాజా సంస్థకు శుభాకాంక్షలు. అమరరాజా 37ఏళ్లుగా సేవలందిస్తోంది. రాష్ట్రానికి వచ్చిన మరో భారీ పెట్టుబడి ఇది. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు అమరరాజా ముందుకొచ్చింది. సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయం. తెలంగాణలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

పెట్టుబడులకు ఇదే సరైన సమయం: గల్లా జయదేవ్‌

‘‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అమరరాజా సంస్థను రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరింది. రాష్ట్ర విభజన తర్వాత మా సంస్థ పెట్టుబడులన్నీ ఏపీకే పరిమితమయ్యాయి. పలు కారణాల వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు మొదలుపెట్టలేకపోయాం. ఇప్పుడు మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు (ఈవీ) మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అని భావించాం. భారత్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లిథియం అయాన్ బ్యాటరీల తయారీపై గత కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నాం. ఇందుకోసం పెట్టుబడులు పెట్టేందుకు సరైన ప్రాంతం కోసం చూశాం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, విధానపరమైన అంశాలపై విస్తృతంగా విశ్లేషించాం. తెలంగాణలో ఈవీ వాహనాల రంగం పుంజుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి.. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈవీ వాహనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని అన్నారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు