Telangana News: ఈ-వేలం ద్వారా స్వగృహ ఫ్లాట్ల విక్రయం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నగరంలోని బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. విక్రయానికి సంబంధించి సంబంధిత అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష...

Published : 04 May 2022 22:17 IST

హైదరాబాద్‌: నగరంలోని బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. విక్రయానికి సంబంధించి సంబంధిత అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫ్లాట్లను విక్రయించేందుకు రూపొందించాల్సిన విధివిధానాల తుది రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు యథాస్థితిలో అమ్మకానికి సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు. బండ్లగూడలోని 1,501 ఫ్లాట్లు, పోచారంలోని 1,470 ఫ్లాట్లు ఈ-వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించినట్లు చెప్పారు. సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వీటిలో 3 బీహెచ్‌కే డీలక్స్‌, 3 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, 1 బీహెచ్‌కే ఫ్లాట్లు ఉన్నాయన్నారు. విక్రయానికి సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు.

‘‘బండ్లగూడలో మొత్తం 1,501 ఫ్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో 419 ఫ్లాట్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. వీటిలో చదరపు అడుగుకు రూ. 3వేలు నిర్ణయించాం. కొద్దిగా అసంపూర్తిగా ఉన్న 1,082 ఫ్లాట్లులో చదరపు అడుగు రూ.2,750 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పోచారంలో సిద్ధంగా ఉన్న 1,328 ఫ్లాట్లు చదరపు అడుగు రూ.2500 చొప్పున, అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్లను చదరపు అడుగు రూ.2,250 చొప్పున విక్రయించాలని నిర్ణయం తీసుకున్నాం. సాధారణ పౌరులు, ఉద్యోగులు ఆసక్తి కలిగిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్లాట్ల అమ్మకాలకు సంబంధించి ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అర్హులైన వారికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. www.swagruha.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన కొనుగోలుదారుల కోసం బండ్లగూడ, పోచారంలో 6 చొప్పున మోడల్ హౌస్‌లు ఉన్నాయి’’ అని మంత్రి ప్రశాంత్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని