Harish rao: కులవృత్తుల వారికి రూ. లక్ష సాయం.. దుర్వినియోగం కాకూడదు: కలెక్టర్లకు ఆదేశాలు

కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీ కోసం జిల్లా కలెక్టర్లు అత్యంత శ్రద్ధ వహించాలని మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ ఆదేశించారు. సంక్షేమ, ఆరోగ్య దినోత్సవాలపై కలెక్టర్లతో దృశ్యమాధ్యమం ద్వారా మంత్రులు సమీక్షించారు.

Updated : 07 Jun 2023 17:58 IST

హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ దినోత్సవం రోజున కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీ కోసం జిల్లా కలెక్టర్లు అత్యంత శ్రద్ధ వహించాలని మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ ఆదేశించారు. సంక్షేమ, ఆరోగ్య దినోత్సవాలపై కలెక్టర్లతో దృశ్యమాధ్యమం ద్వారా మంత్రులు సమీక్షించారు.

‘‘కులవృత్తుల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే బ్యాంకు ఖాతా లింకేజీ లేకుండా లక్ష రూపాయలు గ్రాంటుగా అందిస్తున్నాం. 9వ తేదీన మంచిర్యాలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్లు లబ్ధిదారులకు చెక్కులు అందించాలి. కులవృత్తుల్లో కొనసాగుతోన్న వారిని అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. పథకం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుంది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది.

లబ్ధిదారులను గుర్తించి ప్రతినెలా 15వ తేదీన ఎమ్మెల్యేలతో చెక్కులు పంపిణీ చేయిస్తాం. కులవృత్తులకు దోహదపడే పనిముట్లు, పరికరాలు కొనుగోలు చేసేందుకు లబ్ధిదారులకు సహకరించడంతో పాటు వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి రెండేళ్ల వరకూ ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. 14వ తేదీన ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో 15 మంది గర్భిణులను గుర్తించి కేసీఆర్ కిట్‌లను కలెక్టర్లు పంపిణీ చేయాలి. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు చీరలు, బీపీ తనిఖీ పరికరాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. ఐదు విభాగాల కింద ప్రతిభా పురస్కారాలు ఇచ్చేలా వైద్య నిపుణుల గుర్తింపును కలెక్టర్లు పూర్తి చేయాలి’’ అని మంత్రులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని