No Smoking: ఆఫీసులో నో స్మోకింగ్‌! వర్క్‌ ఫ్రమ్‌ హోంలోనూ! 

జపాన్‌లోని నోమురా హోల్డింగ్స్ అనే కంపెనీ ధూమపానం చేసే తమ సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆఫీసులోనే కాకుండా వర్క్‌ ఫ్రమ్‌ హోం సమయంలో కూడా తమ ఉద్యోగులు ధూమపానం చేయకూడదని కోరింది. 

Published : 03 Sep 2021 16:21 IST

కొత్త నిబంధనను తీసుకొచ్చిన జపాన్‌ కంపెనీ

టోక్యో: జపాన్‌లోని ఓ ప్రముఖ కంపెనీ ధూమపానం చేసే ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ఆఫీసు పనివేళల్లో ఉద్యోగులు ధూమపానం చేయవద్దని కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఆఫీసులోనే కాదు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నపుడు కూడా పొగతాగవద్దని ఆదేశాలు జారీ చేసింది.

జపాన్‌లోని నోమురా హోల్డింగ్స్ అనే కంపెనీ ధూమపానం చేసే తమ సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆఫీసులోనే కాకుండా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నవారికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. దీనిపై మెమోను జారీ చేసి ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ పంపింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రూల్‌ అక్టోబరు నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. అంతేకాకుండా కంపెనీ ఆవరణలో ఉన్న అన్ని స్మోకింగ్ జోన్లను డిసెంబరు నుంచి మూసివేస్తున్నట్లు తెలిపింది. అలాగే పొగతాగిన తర్వాత 45 నిమిషాలు పాటు ఆఫీసుకు దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరించింది.

ఎందుకు చేస్తున్నారంటే..?

కొందరు ఉద్యోగులకు అలవాటుగా మారిన ధూమపానాన్ని నిరోధించి వారి ఆరోగ్యాన్ని సంరక్షించడానికే ఇలా చేస్తున్నామని కంపెనీ అధికార ప్రతినిధి యోషిక ఓట్సు తెలిపారు. అలాగని ఈ నిబంధనలను ఉద్యోగులు పాటిస్తున్నదీ, లేనిదీ కంపెనీ పర్యవేక్షించదనీ, అందుకోసం ఎటువంటి ప్రయత్నాలు చేయదనీ నోమురా హోల్డింగ్స్‌ వెల్లడించింది.  మార్గదర్శకాలను పాటించడం అనేది కంపెనీపై వారికున్న విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ధూమపానానికి వ్యతిరేకంగా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం సిగరెట్‌ వల్ల ఉద్యోగులకు తలెత్తే పలు అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోంతో పెరిగిన వినియోగం..

జపాన్‌ నేషనల్ క్యాన్సర్ సెంటర్ ప్రకారం.. ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి 10 మంది ధూమపానం చేసేవారిలో ఇద్దరిలో సిగరెట్‌ వినియోగం పెరిగిందని తెలిపింది. దీనికి ప్రధాన కారణం ఇంట్లో ధూమపాన నియంత్రణలు లేకపోవడమేనని పేర్కొంది. నోమురా కంపెనీ పొగతాగే ఉద్యోగులను 20 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని తమ కంపెనీ ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కాగా గతేడాది ఏప్రిల్‌లో సాప్ట్‌ బ్యాంకు గ్రూప్ కార్పొరేషన్ కంపెనీ ఇదే నిబంధనను తీసుకొచ్చింది. 2018లో కూడా రెండు సంస్థలు ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా ఆఫీసు పనివేళల్లో ధూమపానాన్ని నిషేధించింది. స్వయంగా సంస్థలు తమ ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఇటువంటి మార్గదర్శకాలను తీసుకురావడం పట్ల పర్యావరణ ప్రేమికులు సంతోషం  వ్యక్తం చేస్తున్నారు. నోమురా వంటి సంస్థల బాటలోనే మరిన్ని కార్పొరేట్‌ కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని