20 ఏళ్ల సహజీవనం.. 60వ ఏట వివాహం!

పెళ్లి కాకుండానే అమ్మాయి, అబ్బాయి ఒకే ఇంట్లో కలిసి ఉండటాన్ని సహజీవనం అంటారు. విదేశాల్లో జంటలు ఏళ్లతరబడి సహజీవనంలో ఉండటం.. వాళ్లకు నచ్చినప్పుడు వివాహం చేసుకోవడం సర్వ సాధారణమే. ఇటీవల కాలంలోఈ సహజీవనం సంస్కృతి మన దేశంలోనూ పెరుగుతోంది. కానీ, రెండు

Updated : 17 Jul 2021 06:15 IST

లఖ్‌నవూ: విదేశాల్లో సహజీనం సంస్కృతి ఏళ్లుగా ఉంది. వాళ్లకు నచ్చినప్పుడు వివాహం చేసుకోవడం అక్కడ సర్వ సాధారణం. ఇటీవల కాలంలో ఈ సంస్కృతి మన దేశంలోనూ పెరుగుతోంది. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ జంట రెండు దశాబ్దాల కిందటే సహజీవనాన్ని మొదలుపెట్టింది. తీరా షష్టిపూర్తి చేసుకోవాల్సిన వయసులో వివాహం చేసుకుంది.

ఉన్నావ్‌ జిల్లాలోని రసూల్‌పుర్‌ రూరీ గ్రామానికి చెందిన నరైన్‌ రైదాస్‌ (60), రామ్‌రతి (55) ప్రేమించుకున్నారు. 2001 నుంచి అదే గ్రామంలో సహజీవనం చేస్తున్నారు. గ్రామంలో ప్రజలంతా వ్యతిరేకించినా.. ఊరిపెద్దలను ఒప్పించి కలిసి జీవిస్తున్నారు. వారికి ప్రస్తుతం 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కారణాలేవైనా.. గ్రామస్థులు ఎంత అవమానించినా ఎందుకో ఇన్నాళ్లు వారు వివాహం చేసుకోవాలని అనుకోలేదు. ఇటీవల గ్రామపెద్ద రమేశ్‌కుమార్‌, సామాజిక కార్యకర్త ధర్మేంద్ర బాజ్‌పేయీ కలిసి నరైన్‌, రామ్‌రతిని వివాహం చేసుకోవాలని కోరారు. వారు, వారి కుమారుడు అవమానాల నుంచి తప్పించుకోవాలంటే పెళ్లి చేసుకోక తప్పదని ఒప్పించారు. వివాహ వేడుకకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ జంట వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. అలా గ్రామ ప్రజలు, కన్న కుమారుడి సమక్షంలో వారిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకను గ్రామస్థులంతా కలిసి నిర్వహించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని