Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా ఔటర్ రింగ్‌ రైలు ప్రాజెక్టు: కిషన్‌రెడ్డి

తెలంగాణకు ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టుపై రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 28 Jun 2023 18:38 IST

దిల్లీ: దిల్లీ: తెలంగాణకు ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టుపై రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బుధవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు(RRR)కు సమాంతరంగా ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు రానుందని వెల్లడించారు. రింగ్‌ రైలు ప్రాజెక్టు వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌, ఔటర్‌ రింగ్‌ రైలుతో హైదరాబాద్‌కు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ రూట్‌ విషయం 99శాతం కొలిక్కి వచ్చిందన్నారు. హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు రావడం దేశంలోనే తొలిసారి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యాపార, రవాణా రంగంలో ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయమైన మార్పు వస్తుందన్నారు. విజయవాడ, గుంటూరు, వరంగల్‌, మెదక్‌, ముంబయి రైల్వే లైన్లకు ఔటర్‌ రింగ్‌ రైలు కనెక్టివిటీగా ఉంటుందన్నారు.

కేంద్రం నిధులతోనే ఎంఎంటీఎస్‌ రెండోదశ పనులు..

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి. 2023 బడ్జెట్‌లో రూ.500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. భూసేకరణ వేగంగా చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఔటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు సర్వేకు కేంద్రం రూ.14 కోట్లు కేటాయించింది. ఘట్‌ కేసర్‌ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ రెండో ఫేజ్‌ చేపట్టాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఎనిమిదేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇస్తామన్న నిధులు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా రూ.330 కోట్ల అంచనాలతో ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభించాలని ప్రధాని మోదీ రైల్వే మంత్రిని ఆదేశించారు. రైల్వేశాఖ నిధులతో ఎంఎంటీఎస్‌ రెండో దశ పూర్తి కాబోతోంది.

కేంద్ర ప్రభుత్వం అనేక ఆరోగ్య సంస్థలను తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. నేషనల్‌ సెంటర్ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఎన్‌సీడీసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదు. భూమిని కేటాయిస్తే భవన నిర్మాణం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. దీనిపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నా. తెలంగాణరాష్ట్రానికి 50 ఏళ్లకు గాను వడ్డీలేని రుణ సాయం రూ.2,102 కోట్లు కేంద్రం ప్రకటించింది. వివిధ రంగాల వారీగా మౌలిక సదుపాయాలు మెరుగు పరచుకునేందుకు ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించింది. యుటిలైజేషన్‌ సర్టిఫికెట్స్‌ ఇస్తే పెండింగ్‌ నిధులు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని