Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటనపై పోలీసు ఆంక్షలు

కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతి తీసుకోవాలని పార్టీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

Published : 03 Jan 2023 15:28 IST

కుప్పం: తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం కుప్పంలో తలపెట్టిన పర్యటనపై పోలీసు ఆంక్షలు మొదలయ్యాయి. రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌షోల మీద ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ఆధారంగా చంద్రబాబు పర్యటనకు అనుమతి తీసుకోవాల్సిందిగా పలమనేరు పోలీసులు కుప్పం తెదేపా నాయకులకు నోటీసులు జారీ చేశారు. అనుమతి ఉన్న చోటే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. దీనిపై తెదేపా నేతలు మండిపడుతున్నారు. ఆంక్షల పేరుతో కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కార్యాచరణకు అనుగుణంగానే మందుకు వెళ్తామని చెబుతున్నారు. కుప్పం నియోజవర్గ పరిధిలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను పార్టీ గత వారమే ఖరారు చేసింది.

మరోవైపు రాష్ట్రంలో రోడ్‌ షో సభలు, ర్యాలీలను నియంత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. మున్సిపల్‌, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్‌ నిబంధనలను అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని ఆదేశాల్లో హోంశాఖ పేర్కొంది. అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో కూడిన అనుమతివ్వనున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని