Train Accident: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా!

విజయనగరం జిల్లాలో జరిగిన రైలు దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడినట్లు పీఎంవో తెలిపింది.

Updated : 29 Oct 2023 22:45 IST

దిల్లీ: విజయనగరం జిల్లాలో అలమండ-కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయంపై ఆయన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడారు. అక్కడి పరిస్థితిపై ప్రధాని ఆరా తీసినట్లు ప్రధాని కార్యాలయం (PMO) వెల్లడించింది. బాధితులకు సాధ్యమైనంత మేరకు అధికారులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని.. మృతుల కుటుంబాలకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు పీఎంఓ తెలిపింది. మరోవైపు, ఈ దుర్ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి నియంత్రణలోనే ఉన్నట్లు వైష్ణవ్‌ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

దిగ్భ్రాంతికి గురయ్యా.. పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనండి: లోకేశ్‌ పిలుపు

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. సమీపంలో తెదేపా శ్రేణులు తక్షణమే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకోవాలని కోరుతూ నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

జనసైనికులు సహాయక చర్యల్లో పాల్గొనండి.. పవన్‌ విజ్ఞప్తి

కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోందని పేర్కొన్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ అధికారులను కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందించాలని పవన్‌ కోరారు. 

దుర్ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో చీకటిగా ఉండటంతో సహాయక చర్యల్లో, మృతుల్ని గుర్తించడంలో ఇబ్బంది కలుగుతోందని క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొద్ది నెలల కిందటే ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటన మరువకముందే ఈ దుర్ఘటన జరడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని.. కంటకాపల్లి ప్రమాద స్థలంలో అవసరమైన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని జనసేన శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని