moon:స్పష్టమైన జాబిల్లి ఫొటో తీసిన పుణె కుర్రాడు

కెమెరా చేతిలో ఉంటే ఏ చెట్టునో.. పక్షినో ఫొటోలు తీయడం చాలా మందికి అలవాటే. కానీ పుణెకు చెందిన ఓ యువకుడు మాత్రం ఏకంగా చంద్రుడి ఫొటోలు తీశాడు.

Published : 21 May 2021 00:08 IST

50 వేల చిత్రాలు..  30-40 గంటల శ్రమ   

సోషల్‌ మీడియాలో వైరల్‌ 

పుణె: కెమెరా చేతిలో ఉంటే ఏ చెట్టునో.. పక్షినో ఫొటోలు తీయడం చాలా మందికి అలవాటే. కానీ పుణెకు చెందిన ఓ పదో తరగతి కుర్రాడు మాత్రం అత్యంత స్పష్టంగా చంద్రుడి ఫొటోలను తీశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రథమేశ్‌ జాజు(16) స్పష్టమైన జాబిల్లి ఫొటోలు తీసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. అయితే ఇది అతడికి అంత సులువుగా సాధ్యం కాలేదు. 50 వేల ఫొటోలు తీసి.. వాటన్నింటిని జతచేసి స్పష్టమైన చందమామ ఫొటోను సాధించాడు. ఇందుకోసం అతడు సుమారు 30-40 గంటల పాటు శ్రమించాల్సివచ్చిందని ప్రథమేశ్‌ చెబుతున్నాడు. ‘‘చంద్రుడిపై ఉన్న ఖనిజాల రంగులను మన కళ్లు స్థిరంగా చూడలేవు. ఇనుము, ఆక్సిజన్‌, టైటానియం లాంటి మూలకాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాలను చిత్రంలోని నీలం రంగులో చూడవచ్చు. ఇనుము, టైటానియం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్‌, పర్పుల్‌ రంగులు సూచిస్తున్నాయి. సూర్యరశ్మి అధికంగా ఉన్న ప్రాంతాలు తెలుపు, బూడిద రంగుల్లో కనిపిస్తున్నాయి’’ అని ప్రథమేశ్‌ తన ఫొటోల గురించి వివరించాడు. ఇంటర్నెట్‌ ద్వారా పలు అంశాలను చదవడంతోపాటు యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఇలాంటి ఫొటోలు తీయడం నేర్చుకున్నట్టు అతడు తెలిపాడు.  ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అతడు ఈ ఫొటోలను షేర్‌ చేయగా.. ఇప్పటికే 38 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ప్రథమేశ్‌ జాజు ప్రస్తుతం పుణెలోని విద్యా భవన్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఫొటోగ్రఫీతోపాటు అథ్లెటిక్స్‌పైనా అతడికి మక్కువ. గతంలో జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లోనూ అతడు పాల్గొన్నాడు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రథమేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 54 వేల మంది  ఫాలోవర్స్‌ ఉన్నారు. భవిష్యత్తులో ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలన్నదే తన లక్ష్యమని అతడు చెబుతున్నాడు. అయితే అంతరిక్ష ఫొటోగ్రఫీ ప్రస్తుతం తన అభిరుచి మాత్రమే అని తెలిపాడు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని