NWDA: నదుల అనుసంధానంపై కీలక సమావేశం... అభిప్రాయాలు తెలిపిన ఏపీ, తెలంగాణ

ట్రైబ్యునల్‌ కేటాయింపులకు ఇబ్బంది లేనంత వరకు గోదావరి జలాల తరలింపునకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated : 10 Nov 2023 22:43 IST

హైదరాబాద్‌: ట్రైబ్యునల్‌ కేటాయింపులకు ఇబ్బంది లేనంతవరకు గోదావరి జలాల తరలింపునకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరి-కావేరీ అనుసంధానంలో ప్రతిపాదించిన నీటి వాటాకంటే తమకు ఎక్కువ భాగం కావాలని కోరింది. నదుల అనుసంధానంపై టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో భాగస్వామ్య రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపాయి. భూసేకరణ వీలైనంత తక్కువగా ఉండాలన్న తెలంగాణ.. ప్రతిపాదిత ఆనకట్టను ఇచ్చంపల్లి కంటే కాస్త పైన ఉంటే సమ్మక్క ఆనకట్ట బ్యాక్‌ వాటర్స్‌తో ఇబ్బంది ఉండబోదని పేర్కొంది.

నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ..

ఎక్కువ వాటా కావాలన్న తెలంగాణ విజ్ఞప్తిని ఎన్‌డబ్ల్యూడీఏ పరిశీలిస్తుందన్న టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ వెదిరె శ్రీరాం.. మొదటి దశలో కేవలం 400 హెక్టార్ల భూసేకరణ మాత్రమే అవసరమని వివరించారు. నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ ఉంటుందన్న ఆయన.. ఎన్‌బ్ల్యూడీఏ బృందం ఇచ్చంపల్లి ప్రాంతాన్ని సందర్శించి సమ్మక్క ఆనకట్ట బ్యాక్ వాటర్స్ ప్రభావం లేకుండా కచ్చితమైన ప్రాంతాన్ని నిర్ధారిస్తుందని తెలిపారు. గోదావరి మిగులు జలాలు కాకుండా కేవలం ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని జలాలు మాత్రమే తరలించాలన్న ఏపీ.. ఇందుకోసం జలసంఘం తాజా అధ్యయనాలను ఎన్‌డబ్ల్యూడీఏ పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. నాగార్జునసాగర్, సోమశిల జలాశయాలు ప్రస్తుత ఆయకట్టుతో పాటు కొత్త అవసరాలను కూడా తీర్చే విషయమై ఎన్‌డబ్ల్యూడీఏ అధ్యయనం చేయాలని కోరింది.

ఏపీ హక్కులకు ఎలాంటి భంగం కలగదు..

ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై చర్చించేందుకు తమతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరిన ఏపీ.. దిగువ రాష్ట్రంలో తమ ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న హామీ ఇవ్వాలని కోరింది. గోదావరి జలాల మళ్లింపునకు ఇచ్చంపల్లికి ప్రత్యామ్నాయంగా పోలవరాన్ని పరిశీలించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిగులు జలాలను వినియోగించుకునేది లేదన్న వెదిరె శ్రీరాం.. సాంకేతిక అంశాలపై ఏపీ అధికారులతో ఎన్‌డబ్ల్యూడీఏ విడిగా సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు. నాగార్జునసాగర్, సోమశిల జలాశయాల సామర్థ్యం విషయమై ఎన్‌డబ్ల్యూడీఏ అధ్యయనం చేయాలని సూచించారు. దిగువ రాష్ట్రంగా ఏపీకి ఉండే హక్కులకు ఎలాంటి భంగం కలగబోదన్న శ్రీరాం.. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు కాల్వ తెలంగాణ అవసరాలకు లోబడి ఉందని వివరించారు. ఇచ్చంపల్లి ప్రతిపాదన కేవలం మొదటి దశ మాత్రమే అన్న ఆయన.. తదుపరి దశల్లో పోలవరం ప్రతిపాదనను పరిశీలిస్తామని వివరించారు. ఒప్పందంపై సంతకం చేసేందుకు తెలంగాణ, ఏపీ సంసిద్ధత వ్యక్తం చేశాయన్న వెదిరె శ్రీరాం.. ప్రాజెక్టుకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా పూర్తి మద్దతు తెలిపాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని