China: ఆ గ్రామంలో సగం మంది మరుగుజ్జులే..!

చైనాలోని యాంగ్జి గ్రామ ప్రజలు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అక్కడి జనాభాలో దాదాపు 50 శాతం మంది మరగుజ్జులేనట.

Published : 14 Nov 2021 20:02 IST

 వారి సమస్య ఇప్పటికీ అంతుపట్టని రహస్యమే

బీజింగ్: చైనాలోని యాంగ్జి గ్రామ ప్రజలు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అక్కడి జనాభాలో దాదాపు 50 శాతం మంది మరుగుజ్జులేనట. ఆ గ్రామంలో పుట్టి పెరిగిన 80 మందిలో 40 మంది దేశ సగటు ఎత్తు ఎదగలేదని ఓ నివేదిక వెల్లడించింది. పొడవైన వ్యక్తి 3 అడుగుల 10 అంగుళాలు ఉండగా, పొట్టిగా ఉన్న వ్యక్తి ఎత్తు 2 అడుగుల ఒక అంగుళం మాత్రమే. వారంతా పొట్టివాళ్లుగా మారడం వెనక గల కారణమేంటని శాస్త్రవేత్తలు ఎన్నో అంశాలను పరిశీలించారు. వారు పీల్చే గాలి, నీరు, ఆహారం, నేల తీరు అన్నింటిని పరీక్షించారు. అయినా అసలు గుట్టును మాత్రం కనిపెట్టలేకపోయారు.

అయితే దీనిపై యాంగ్జి ప్రజలను పలకరిస్తే ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తారు. ఒకసారి వేసవి కాలంలో రాత్రి సమయంలో 5 నుంచి 7 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు అంతుపట్టని వ్యాధి సోకిందని, ఆ పిల్లల్లో ఎదుగుదల లోపించిందని ఒకరు వెల్లడించారు. వారితో పాటు మరికొందరు ఇతర శారీరక లోపాలతో బాధపడుతున్నారన్నారు. 1997 నాటికి అక్కడి నేలలో అధిక స్థాయిలో పాదరసం ఉండటమే ఎదుగుదల లోపానికి కారణమని మరొకరన్నారు. అయితే దానికి తగ్గ శాస్త్రీయ ఆధారం మాత్రం లభించలేదని పరిశోధకులు వెల్లడించారు. జపాన్ నుంచి వచ్చిన విషవాయువు కావొచ్చని భావిస్తున్నవారు లేకపోలేదు. దీనికి కూడా ఆధారం దొరకలేదు. ఇదిలా ఉండగా.. తన భూభాగం అయిన యాంగ్జి గ్రామంలోకి చైనా ప్రభుత్వం విదేశీ పర్యాటకుల్ని మాత్రం అనుమతించదు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని