Coronavirus: కొవిడ్‌ సోకిన ఏడు నెలల వరకు శరీరంలోనే వైరస్‌!

కరోనా వైరస్‌ ఒక్కసారి సోకితే అది నెలలపాటు ఒంట్లోనే ఉండి వివిధ శరీర భాగాలపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది......

Published : 28 Dec 2021 01:21 IST

వెల్లడించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం

వాషింగ్టన్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని చుట్టేస్తున్న తరుణంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్‌ ఒక్కసారి సోకితే అది నెలలపాటు ఒంట్లోనే ఉండి వివిధ శరీర భాగాలపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం చేపట్టారు. కాగా కరోనా సోకినప్పటినుంచి ఏకంగా 230 రోజులపాటు (ఏడున్నర నెలలు) వైరస్‌ మానవ శరీరంలో ఉంటున్నట్లు గుర్తించారు. శరీరంలోని పలు అవయవాలు సహా మెదడులోనూ దీన్ని గుర్తించినట్లు వెల్లడించారు. లక్షణం లేనివారు, తేలికపాటి లక్షణాలు ఉన్నవారిలోనూ అదే స్థాయిలో వైరస్‌ ఉన్నట్లు పేర్కొన్నారు.

వైరస్‌ లోడు అత్యధికంగా శ్వాసకోశంలో (97.7 శాతం) గుర్తించినట్లు అధ్యయనం వెల్లడించింది. ఆ తర్వాత గుండె రక్తనాళ కణజాలం, లింఫోయిడ్, జీర్ణశయాంతర కణజాలాలు, మూత్రపిండం, ఎండోక్రైన్ కణజాలంలో గుర్తించినట్లు తెలిపింది.  పునరుత్పత్తి కణజాలం, కండరాలు, చర్మం, కొవ్వులోనూ వైరస్‌ ఉండటాన్ని కనుగొన్నట్లు వివరించింది. మెదడు కణజాలంలోనూ ఏడు నెలలపాటు ఉంటోందని పేర్కొంది. పలు అవయవాలపై దాడి చేస్తోందని చెప్పిన శాస్త్రవేత్తలు.. ఊపిరితిత్తులపై మాత్రం ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించలేదని చెప్పారు. కొవిడ్‌ సోకి మృతిచెందిన 44 మంది మృతదేహాలపై రోజులపాటు పరీక్షలు నిర్వహించారు.

పలు దేశాల్లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. బ్రిటన్‌లో ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదవుతుండగా.. అమెరికాలోనూ ఉద్ధృతి కొనసాగుతోంది. న్యూయార్క్‌ నగరంలో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పిల్లల ఆసుపత్రుల్లో కొవిడ్‌తో సంబంధం ఉన్న కేసుల్లో నాలుగు రెట్ల పెరుగుదల కనిపించిందని న్యూయార్క్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌ పేర్కొంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి దేశంలో థర్డ్‌ వేవ్‌కు దారితీస్తుందనే భయం వ్యక్తమవుతోంది. మరో రెండు వారాల పాటు స్థిరంగా కేసుల పెరుగుదల కొనసాగితే.. మూడో వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని