Pawankalyan: ‘చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలచివేసింది’: పవన్‌

సైదాబాద్‌లో ఆరేళ్లబాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సైదాబాద్‌

Updated : 15 Sep 2021 20:41 IST

హైదరాబాద్‌: సైదాబాద్‌లో ఆరేళ్లబాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. పవన్‌ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సైదాబాద్‌ చేరుకున్నారు. అభిమానుల రద్దీ, తోపులాట కారణంగా కారుదిగి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో చిన్నారి తండ్రిని కారు వద్దకే పిలిపించుకుని పవన్‌ మాట్లాడారు. అభిమానుల తోపులాటలో స్థానికుడి కారు ధ్వంసమైంది. బాధిత కుంటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు, నిందితుడికి సరైన శిక్ష పడే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. చిన్నారికి జరిగిన దారుణం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ‘‘అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చనిపోయిన బిడ్డకు న్యాయం జరగాలని కోరుకోవాలి. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు నా విన్నపం. మంత్రివర్గంలోని పెద్దలను పంపి బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు భరోసా కల్పించండి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకు ఓదార్పు అవసరం. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయగలమో ఆలోచించి చేయాలని కోరుకుంటున్నా’’ 

మీడియా బాధ్యతగా వ్యవహరించాలి

‘‘ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం సమాజానికి అంత మంచిది కాదు. మీడియా కొన్ని సంఘటనలపై ఎక్కువగా ప్రచారం చేసి.. ఇలాంటి వాటిపై స్పందించకపోవడం సరికాదు. ఇలాంటి వ్యవహారాల్లో కూడా బాధ్యతగా ఉండాలి. ఏదో ఒక సంఘటన పట్టుకుని హైలెట్‌ చేసి వదిలేయకుండా అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎక్కువ మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సోషల్‌ మీడియా ద్వారా ఈఘటన బయటకు వచ్చింది. ఇప్పటి వరకు నిందితుడు దొరకలేదని, తమకు న్యాయం జరగలేదని చిన్నారి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. పోలీసు అధికారులకు నా తరఫున ఓ విన్నపం. బిడ్డ చనిపోయిన బాధలో ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని