
TS News: ‘పది’లో ఈసారి ఆరు పరీక్షలే: విద్యాశాఖ కీలక ఉత్తర్వులు
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతిలో ఈ ఏడాది ఆరు పరీక్షలే నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ‘పది’ పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా ఈసారి ఆరు పరీక్షలే నిర్వహించాలని, ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున ఉండాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా ప్రభావంతో పాఠశాలల్లో ఇంకా పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించలేని పరిస్థితుల్లో పరీక్ష విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాదే ఈ మార్పులు చేసింది. అయితే, చివరి నిమిషంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల కారణంగా పరీక్ష రాయకుండానే అందరినీ ఉత్తీర్ణులను చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గతేడాది ప్రతిపాదించిన విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. కొత్త విధానం ప్రకారం పదో తరగతి విద్యార్థులకు ఆరు పరీక్షలే నిర్వహిస్తారు. గతేడాది ముందువరకు 11 పేపర్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 166 రోజులు బోధన నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఇంకా గురుకులాలు తెరుచుకోలేదు. రాష్ట్రంలో విద్యార్థులు కూడా పాఠశాలలకు పూర్తిస్థాయిలో రావడంలేదు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు పరీక్ష విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించారు.
పరీక్ష సమయం అరగంట పెంపు
పదో తరగతి పరీక్షలకు సమయం అరగంట పెంచాలని అధికారులు నిర్ణయించారు. పదో తరగతి విద్యార్థులకు 3 గంటల 15 నిమిషాల పాటు ఒక్కో పరీక్ష జరగనుంది. సైన్సు పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయి. పశ్నల్లో మరిన్ని ఛాయిస్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. బోర్డు పరీక్షకు 80 మార్కులు, ఎఫ్ఏ పరీక్షలకు 20 మార్కులు చొప్పున కేటాయించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
పాఠశాలల్లో సిలబస్ తగ్గింపు
పాఠశాల విద్యార్థులకు సిలబస్ తగ్గిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1 నుంచి 10 తరగతులకు 70శాతం సిలబస్ బోధించాలని నిర్ణయించారు. సిలబస్ తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతేడాది ఉత్తర్వులను ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.