Ts News: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులపై జీవో జారీ

తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో 11 నుంచి

Published : 05 Jan 2022 01:46 IST

హైదరాబాద్: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో 11 నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్నా.. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే సెలవులు ప్రకటిస్తూ సోమవారం సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా మెడికల్‌ కళాశాలలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

దేశం, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ఒమిక్రాన్‌పై ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పనిచేసే చోట్ల అప్రమత్తత పాటిస్తూ మాస్క్‌లు ధరించాలని, నిబంధనలను విధిగా పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులన్నింటినీ పూర్తిస్థాయిలో మెరుగుపరచాలని.. పడకలు, ఆక్సిజన్‌, ఔషధాలు పరీక్ష కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని ఆదేశించారు. అన్ని దవాఖానాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలన్నారు. హైదరాబాద్‌ తరహాలో అన్ని నగరపాలక సంస్థల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేయాలని సూచించారు.

‘‘పెరుగుతున్న జనాభా అవసరాల రీత్యా రాష్ట్రంలో డాక్టర్లు, పడకలు, ఇతర మౌలిక వసతులు పెరగాలి. నూతనంగా నిర్మించుకున్న సమీకృత కలెక్టర్‌ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్లను, శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్యశాఖకు బదలాయించాలి. ప్రభుత్వాసుపత్రుల్లో పడకల్లో దాదాపు 99 శాతానికి ఆక్సిజన్‌ సమకూరింది. మిగిలిన ఒక్క శాతానికి కూడా దాన్ని కల్పించాలి. రాష్ట్రంలో ఆక్సిజన్‌ 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాలి. హోం ఐసొలేషన్‌ కిట్లను కోటికి పెంచాలి. పరీక్ష కిట్లను రెండు కోట్లకు పెంచాల’’ని సీఎం ఆదేశించారు.

సమీక్షలో భాగంగా రాష్ట్రంలోని పరిస్థితులను వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎంకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు లేవని తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని