Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Published : 26 Sep 2021 20:56 IST

1. ఎల్లుండి వరకు భారీ వర్షాలు: తెలంగాణ సీఎస్‌

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అప్రమత్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెండ్రోజుల పాటు రాష్ట్రంపై గులాబ్‌ తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

2. తీరాన్ని తాకిన గులాబ్‌ తుపాను..

గులాబ్‌ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవుతుందని తెలిపింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. తుపాను తీరం దాటే వేళలో 95 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

3. ట్యాంక్‌ బండ్‌పై ‘సన్‌డే-ఫన్‌డే’ సందడి

హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ అందాల వీక్షణకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. హెచ్‌ఎండీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తు్న్న సన్‌డే-ఫన్‌డే కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈవారం ప్రత్యేకంగా రైల్వే రక్షకదళం ఆవిర్భావ దినోత్సవాన్ని ట్యాంక్‌ బండ్‌ వేదికగా నిర్వహించారు. ఈసందర్భంగా రైల్వే రక్షణ సిబ్బంది బ్యాండ్‌ షోతో సందర్శకులను అలరించారు.

4. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం: కిషన్‌రెడ్డి

బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని భాజపా సర్కార్‌ పథకాలు అమలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన జాతీయ బీసీ కమిషన్‌ సదస్సులో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. బీసీ కమిషన్‌ ఆదేశాలు అమలు చేయకపోతే అండగా నిలవాల్సిన బాధ్యత బీసీ సంఘాలదేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తిండిలేక ఇబ్బందులు పడుతున్న వారి కోసమే ఆహార భద్రత చట్టం తీసుకొచ్చినట్లు చెప్పారు.

5. న్యాయవ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ అవసరం

దేశ న్యాయవ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయ కళాశాలల్లోనూ ఇదే తరహా రిజర్వేషన్‌ అవసరమని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి సహా నూతనంగా నియమితులైన తొమ్మిది మంది జడ్జిలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా.. మహిళా న్యాయమూర్తులను ఉద్దేశించి జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడారు.

6. నదుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం

నదులను కాలుష్య రహితం చేసేందుకు దేశ ప్రజల సమష్టి కృషి అవసరమని ప్రధాని మోదీ అన్నారు. నదులు కేవలం ప్రకృతి సంబంధమైనవే కావని.. తల్లి ఇచ్చే జీవితంతో సమానమని పేర్కొన్నారు. నదులు నీటిని దాచుకోకుండా నిస్వార్థంగా ఇతరులకు అందిస్తాయన్నారు. ప్రపంచ నదుల దినోత్సవం (సెప్టెంబరు 26) నేపథ్యంలో 81వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.

7. పవన్‌ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: ఫిల్మ్‌ ఛాంబర్‌

‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఆదివారం ఉదయం నుంచి ఏపీ మంత్రులు, వైకాపా నాయకులు పవన్‌ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటన విడుదల చేసింది. చిత్ర పరిశ్రమ మనుగడ సాగించాలంటే రెండు ప్రభుత్వాల మద్దతు అవసరమని చెప్పుకొచ్చింది. వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తమకూ సంబంధం లేదని తెలిపింది.

8. మావోయిస్టులకు నిధులందకుండా చూడాలి.. ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం

దేశంలో మావోయిస్టులను కట్టడి చేసేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు వారికి నిధులు అందకుండా చూడాల్సిన అవసరం ఉందని ఈ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అభిప్రాయపడింది. మావోయిస్టులకు సాయం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవడం సహా భద్రతాపరమైన లోపాలను నివారించాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు.

9. రెండు లక్షల గ్రామాలకు మా బ్యాంకింగ్‌ సేవలు విస్తరిస్తాం!

రానున్న 18-24 నెలల వ్యవధిలో భారత్‌లోని రెండు లక్షల గ్రామాలకు తమ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష గ్రామాల్లో సేవలు అందిస్తున్నట్లు, తాజా లక్ష్యం నెరవేరితే మొత్తం మూడో వంతు పల్లెలకు విస్తరించినట్లవుతుందని తెలిపింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది.

10. ఉత్కంఠ పోరులో చెన్నైదే విజయం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఐపీఎల్‌ సీజన్‌-14 రెండో దశలో ఇప్పటికే రెండు విజయాలు సాధించి జోరు మీదున్న సీఎస్కే.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగరేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్ (40; 28 బంతుల్లో 2×4, 3×6), డుప్లెసిస్‌ (43; 30 బంతుల్లో 7×4) రాణించడంతో కోల్‌కతా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని