Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 27 Dec 2021 17:20 IST

1.సీఎం సాబ్‌.. ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధమే: కేసీఆర్‌కు తరుణ్‌ చుగ్‌ సవాల్‌

కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణ బంగారం కాలేదని,  సీఎం కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారుమయమైందని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్షలో ఆయన మాట్లాడారు.

2.జగన్‌ బెయిల్‌ రద్దుపై హైకోర్టు తీర్పు రిజర్వు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అక్రమాస్తుల కేసులో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సోమవారం మరోసారి వాదనలు విన్న తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. గతంలో ఇదే అంశంపై రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

Viral video : నడుస్తున్న వ్యక్తిపై పిడుగు ఎలా పడిందో చూశారా?

3.ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 53, 54జీవోలను చేసిన విషయం తెలిసిందే.

4.అణుదాడులను తట్టుకొనేలా భారత సైనిక స్థావరాలు..!

అణుదాడులను తట్టుకొనేలా భారత్‌ సైనిక స్థావరాలను అభివృద్ధి చేస్తోంది. ఈ విషయాన్ని సైన్యంలోని ఇంజినీర్స్‌ కోర్‌  అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హర్పాల్‌ సింగ్‌ వెల్లడించారు. ఆయన ఇటీవల ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌లో అవార్డును అందుకొన్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు అనుసంధానమై ఉండేట్లు ఇంజినీర్స్‌ కోర్‌ కృషి చేస్తోందని తెలిపారు.

5.షీజిన్‌పింగ్‌ ప్లాన్ల వెనుక అతడు..!

చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ ఎక్కడికి వెళ్లినా.. బ్యాగ్‌ పట్టుకొని ఒక బక్కపలచని వ్యక్తి ఆయన సమీపంలోనే ఉంటాడు. అతని పేరు వాంగ్‌ హుయినింగ్.. ఈ పేరు వార్తల్లో చాలా తక్కువగా వినిపిస్తుంటుంది.  చైనా కమ్యూనిస్టుపార్టీలోని అత్యంత శక్తివంతమైన ఏడుగురు నాయకుల్లో ఒకరు. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ హెన్రీ కిసెంజర్‌కు ఉన్న తెలివితేటలు.. బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌ సమర్థత కలిపితే వాంగ్‌ హుయినింగ్ అంటారు విశ్లేషకులు.

Balakrishna: యాదాద్రి ఆలయంలో ‘అఖండ’ టీమ్‌ ప్రత్యేక పూజలు

6.₹15 వేలలోపు ధరలో.. 2021లో పాపులర్‌ అయిన 10 స్మార్ట్‌ఫోన్స్‌

ప్రపంచ మొబైల్ మార్కెట్లో భారత్‌ది రెండో స్థానం. అంతేకాకుండా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మిలినియల్స్‌ సంఖ్య కూడా ఎక్కువే. అందుకే మొబైల్‌ కంపెనీలు భారత్‌లో ఎక్కువ మోడల్స్‌ను విడుదల చేస్తుంటాయి. అందులోనూ ఎక్కువ ఫీచర్స్‌తో తక్కువ ధరకే ఫోన్లను తీసుకొస్తున్నాయి. అలా 2021లో రెడ్‌మీ, రియల్‌మీ, శాంసంగ్, మైక్రోమాక్స్‌, మోటోరోలా, ఒప్పో, వివో వంటి కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త ఫోన్లను విడుదల చేశాయి.

7.15-18 ఏళ్ల వారికి జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు..

దేశంలో 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకాలను అందించేందుకుం కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ వయసు వారికి జనవరి 1 నుంచి కొవిన్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నట్లు సోమవారం వెల్లడించింది. విద్యాసంస్థల ఐడీ కార్డులతోనూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

8.పెళ్లి తర్వాతా రాణించడానికి కారణం అదే: నటి ఆకాంక్షసింగ్‌

పెళ్లితో కథానాయిక కెరీర్‌ ముగిసిపోతుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అందులో నిజంలేదని, వివాహమయ్యాకే తాను ఎక్కువ అవకాశాలు అందుకున్నానని ఆకాంక్షసింగ్‌ తెలిపారు. ‘మళ్లీరావా’, ‘దేవదాస్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి ఇప్పుడు ‘పరంపర’ అనే వెబ్‌ సిరీస్‌తో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఈనాడు.నెట్‌’తో ప్రత్యేకంగా సంభాషించారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలెన్నో పంచుకున్నారు.

Viral news : కార్చిచ్చు.. వందల ఎకరాల్లో బూడిదైన చెట్లు !

9.ఇంకా 4 రోజులే గడువు.. 31లోపు ఈ పనులు పూర్తి చేయండి!

పాత ఏడాదికి బాయ్‌ చెప్పి.. కొత్త ఏడాదికి హాయ్‌ చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. 2021వ సంవత్సరం క్యాలెండర్‌ తీసేసి 2022వ సంవత్సరం క్యాలెండర్‌ పెట్టుకోవాల్సిన టైమ్‌ దగ్గరపడింది. అందుకు ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది. ఆర్థిక విష‌యాల‌కు సంబంధించి ఈ లోపు పూర్తిచేయాల్సిన కొన్ని ముఖ్య‌మైన ప‌నులు ఉన్నాయి. డిసెంబర్‌ 31లోగా ఈ పనులు పూర్తి చేయడంలో విఫలమైతే ఆర్థికంగా కొంత నష్టపోయే ప్రమాదం ఉంది.

10.వర్షం కారణంగా భారత్‌ - దక్షిణాఫ్రికా టెస్టుకు అంతరాయం.!

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. సెంచూరియన్‌లో వర్షం కొనసాగుతుండటంతో రెండో రోజు ఆట మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది. కాసేపటి క్రితం మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు వర్షం ఇంకా తగ్గక పోవడంతో.. నేరుగా లంచ్‌ బ్రేక్‌ తర్వాత మ్యాచ్‌ ప్రారంభించాలని నిర్ణయించారు. లంచ్‌ తర్వాత అంపైర్లు మరోసారి మైదానాన్ని పరిశీలించి ఆటపై నిర్ణయం తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని