Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 14 Nov 2021 22:13 IST

1.మరి కేసీఆర్‌...ఏం అడుక్కోవడానికి వెళ్తున్నారు?
ఏపీ అభివృద్ధి కార్యక్రమాలకు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మేం బిచ్చం ఎత్తుకున్నామో.. అడుక్కోవడానికి వెళ్తున్నామో.. ఏదో చేస్తున్నామనుకోండి. మరి కేసీఆర్‌ మాటిమాటికీ పనిగట్టుకుని ఏం అడుక్కోవడానికి వెళ్తున్నారు?’ అని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘నేను కేంద్రంలో చేరతా, మాకు మంత్రి పదవులనివ్వండి.. మా తలుపులు తెరిచే ఉన్నాయి అని అడిగేందుకు కాదా కేసీఆర్‌ వెళుతోంది?’ అని వ్యాఖ్యానించారు.

2.జాబిల్లి ‘ఊపిరి’తలం!

అంతరిక్షయానాలు పెరుగుతున్నాయి. చందమామపైకి మానవసహిత యాత్రలు కొన్నేళ్లలో ప్రారంభం కానున్నాయి. అక్కడ మానవ ఆవాసాల ఏర్పాటు ఆలోచనలూ ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోదసిలోని వనరులను సమర్థంగా వినియోగించుకునే పరిజ్ఞానాలపై శాస్త్రవేత్తల దృష్టి పెరిగింది. ముఖ్యంగా ప్రాణులకు జీవాధారమైన ఆక్సిజన్‌ను చంద్రుడి నుంచి సేకరించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

3.ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వై.శ్రీలక్ష్మికి సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. తనపై సీబీఐ విచారణ నిలిపివేయాలంటూ ఆమె దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఓబుళాపురం గనుల తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తేలేవరకూ... ఓఎంసీ కేసులో తనపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సెప్టెంబరు 21న కొట్టేసింది.

4.ఉరుముతున్నా ఉదాసీనమేనా!
జర్మనీ, సింగపూర్‌, బ్రిటన్‌, రష్యా, చైనా వంటి దేశాల్లో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. అంతర్జాతీయ రాకపోకలు యథాస్థితికి చేరుకున్న నేపథ్యంలో కొత్తవేరియంట్లు భారత్‌లోకి ప్రవేశించే ముప్పు ఉందని, అది మూడోదశ ఉద్ధృతికి దారితీయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, కచ్చితంగా రెండుడోసుల టీకా స్వీకరించాలని పదేపదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

5.వరి పంటపై భాజపా చలిమంటలు

‘వడ్లు కొనబోమని కేంద్రం చెబుతోంటే వరి సాగు చేయాలని రాష్ట్ర భాజపా నాయకులు అంటున్నారు. కేంద్రం ఆదేశాలను మేం పాటిస్తుంటే వారు కావాలని తొండిపెట్టి వరిపంటపై చలిమంటలు పెట్టి ఓట్ల రాజకీయం చేస్తున్నారు’ అని రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెరాస చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా సిరిసిల్లలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.

6.ఇక పాత పద్ధతిలోనే రైళ్లు
‘ప్రత్యేక రైళ్లు’ అనే ముద్ర ఇకపై తొలగిపోనుంది. ఆ పేరుతో వసూలు చేసే ప్రత్యేక ఛార్జీలకు కూడా రైల్వే శాఖ ముగింపు పలకనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనాకు ముందున్న విధంగానే రైళ్ల పేర్లు, వాటి ఛార్జీలు ఉండనున్నాయి. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ప్రయాణికుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ దగ్గర నుంచి రైల్వే శాఖ కేవలం ‘స్పెషల్‌ ట్రైన్స్‌’ను మాత్రమే నడుపుతోంది.

7.ఫైనల్లో.. సరైనోళ్లే
అయిదేళ్ల విరామం తర్వాత  జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ విజేత ఎవరో మరొక్క రోజులో తేలిపోతుంది. టోర్నీ ఆరంభమైనపుడున్న అంచనాలు వేరు. టోర్నీ సాగిన తీరు వేరు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న టీమ్‌ఇండియా సూపర్‌-12 దశను కూడా దాటలేదు. సూపర్‌-12లో ఘనవిజయాలతో ఫేవరెట్లుగా అవతరించిన ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ సెమీస్‌ గడప దాటలేకపోయాయి. ఇప్పటిదాకా కప్పు గెలవని, పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా ఇప్పుడు కప్పు కోసం కొట్లాడబోతున్నాయి.

8.చిన్న మదుపర్లూ సెక్యూరిటీలు కొనచ్చు

సామాన్యుడి అవసరాలను దృష్టిలో ఉంచుకునే బ్యాంకింగ్‌ వ్యవస్థ పనిచేయాలని, మదుపర్లకు భరోసానివ్వాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆవిష్కరించిన ‘రిటైల్‌ డైరెక్ట్‌ స్కీం’, ఏకీకృత అంబుడ్స్‌మెన్‌ పథకం(ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌)లను ఆయన దృశ్యమాధ్యమ పద్ధతిలో ప్రారంభించారు.

9.చేయి పట్టుకొని నడిపించరు
అన్న అర్జున్‌రెడ్డి... తమ్ముడిది మిడిల్‌క్లాస్‌ మెలోడీ! అన్న మాస్‌గా ఉండే డియర్‌ కామ్రేడ్‌... తమ్ముడిది క్లాస్‌ మనస్తత్వం ఉన్న పుష్పకవిమానం... ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ పరిచయం ఆనంద్‌ దేవరకొండదే అని! అన్న చాటు తమ్ముడిగా ఒదిగిపోకుండా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటంలో ఉన్నాడు ఈ కుర్రాడు.
10.‘స్వయం’గా.. తెలుగు వెలుగు
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఆంగ్లంలోనే ఆన్‌లైన్‌ కోర్సులు ఉండేవి. ప్రస్తుతం ప్రాంతీయ భాషల్లోనూ ఈ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ స్వయం (స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ యాస్పైరింగ్‌ మైండ్స్‌) పేరిట వీటిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. తెలుగు భాషలోనూ ఈ ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని