Amaravati: వైకాపా మాజీ నేత దండా నాగేంద్రకు 14 రోజుల రిమాండ్‌

తెలంగాణ మద్యం తరలింపు కేసులో అరెస్టయిన వైకాపా మాజీ నతే నాగేంద్రకు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Published : 04 Sep 2023 16:49 IST

అమరావతి: పల్నాడు జిల్లా అమరావతికి (Amaravati) చెందిన వైకాపా మాజీ నేత దండా నాగేంద్రను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై నాగేంద్ర జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో ఇటీవల కేసు దాఖలు చేశారు. ఆయన వేసిన పిటిషన్‌ను విచారించిన తర్వాత ఇసుక తవ్వకాలు ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు వచ్చిన కొద్ది రోజులకే నాగేంద్రపై ఎస్సీ అట్రాసిటీ  కేసు నమోదైంది.  వైకాపా కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు నాగేంద్రపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో నాగేంద్ర బెయిల్‌ తెచ్చుకున్నారు. తాజాగా నాగేంద్రపై తెలంగాణ మద్యం తరలింపు కేసును బనాయించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వద్ద నాగేంద్రను మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

నాగేంద్ర గతంలో పెదకూరపాడు వైకాపా ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుతో ఉండే వారు. హరిత ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు తర్వాత శంకర్రావుకు నాగేంద్ర దూరమయ్యాడు. ఆ తర్వాత కేసులు పెట్టారు. అమరావతిలో నాగేంద్ర అతిథి గృహానికి నోటీసులు ఇచ్చారు.  దీంతో కొంతకాలం నాగేంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవలే బయటకు వచ్చిన నాగేంద్ర.. తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన సమాచారాన్ని చంద్రబాబుకు అందించినట్టు ప్రభుత్వ పెద్దలకు తెలిసింది. దీంతో నాగేంద్రను పాత కేసులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం నాగేంద్రపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. అయితే, ఈ విషయం బయటకు రానీయలేదు. హరిత ట్రైబ్యునల్‌లో కేసు విషయంలో నాగేంద్రను ప్రోత్సహించిన కంచేటి సాయిని ఇప్పటికే పోలీసులు పీడీ యాక్టు కింద అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైల్లో ఉంచారు. ఇప్పుడు నాగేంద్రను అరెస్టు చేయడం చూస్తుంటే.. ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని