governor Tamilisai: బిల్లులను తొక్కిపెట్టాననడం సబబు కాదు: గవర్నర్‌ తమిళి సై

రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను తొక్కిపెట్టాననడం సబబుకాదని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ అన్నారు. బిల్లుపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Published : 10 Nov 2022 01:19 IST

హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ తెలిపారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ బిల్లుల విషయమై పరిశీలిస్తున్నట్టు చెప్పారు.  ‘‘ప్రభుత్వం నుంచి నా వద్దకు బిల్లులు వచ్చాయి. బిల్లుల విషయమై పరిశీలిస్తున్నాం. సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నా. ఆ బాధ్యత నాపై ఉంది.  ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని చెప్పాను.

ఖాళీల విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చాను. పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్‌ చేస్తున్నా. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోంది. నేను ఎలాంటి బిల్లులు ఆపలేదు. బిల్లులను తొక్కిపెట్టాననడం సబబుకాదు. కొత్త విధానంపై నాకు సందేహాలు ఉన్నాయి.  కొత్త విధానం అవసరమా? కాదా అని పరిశీలిస్తున్నాం. బోధనా పోస్టులను భర్తీ చేయాలని మొదటి నుంచి చెబుతూనే ఉన్నా. కొత్త నియామక బోర్డు అవసరం ఏమొచ్చింది. వీసీ పోస్టులు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. నేను పదే పదే డిమాండ్‌ చేశాక వీసీలను నియమించారు. 8 ఏళ్లుగా వీసీలను నియమించకపోతే ఐకాస ఎందుకు ఆందోళన చేయలేదు. ఒక నెల నావద్ద ఆగిపోగానే ఎందుకు ఆందోళన చేస్తున్నారు. నియామకాల బిల్లుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చాను. బిల్లులను ఒకదాని వెంట ఒకటి పరిశీలిస్తున్నా. బిల్లులు పంపించగానే ఆమోదించడం మాత్రమే నా విధి కాదు. నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాననడం ఆశ్చర్యకరం’’ అని గవర్నర్‌ అన్నారు.

ప్రగతి భవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయి..

‘‘కొంత మంది ప్రొటోకాల్‌ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నా పర్యటనలకు సంబంధించి పూర్తి వివరాలు ముందుగానే సంబంధిత అధికారులకు పంపిస్తాను. గతంలో నా పర్యటనల్లో ప్రొటోకాల్‌ పాటించని కలెక్టర్లు, ఎస్పీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి. మీరు ప్రొటోకాల్‌ పాటించేవారైతే గవర్నర్‌కు స్వాగతం పలికేందుకు రాని  అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు మీకు నచ్చినట్లు చేయొచ్చు.. ప్రతిఒక్కరిపై ఆరోపణలు చేయొచ్చు. కేవలం రాజ్‌భవన్‌ గౌరవాన్ని దిగజార్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా రాజ్‌భవన్‌కు వెళ్లి నిరసన తెలపాలని చెబుతున్నారు. రాజ్‌భవన్‌ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఎంతో మంది వచ్చి కలుస్తున్నారు. ఇక్కడికి వచ్చేవారిని ఎవరూ అడ్డుకోవడం లేదు. ప్రగతిభవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా రాజ్‌భవన్‌కు రావొచ్చు... విజ్ఞప్తులు ఇవ్వొచ్చు’’ అని గవర్నర్‌ తెలిపారు.

వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది..

‘‘రాజ్‌భవన్‌ ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటుంది. ఫాంహౌస్‌ కేసులోనూ రాజ్‌భవన్‌ను లాగే ప్రయత్నం చేశారు. నా మాజీ ఏడీసీ తుషార్‌ను ఈకేసులోకి తీసుకొచ్చిన కారణం అదే. ఆడియో టేప్‌ విషయంలోనూ రాజ్‌భవన్‌ ప్రస్తావన తెచ్చారు. ప్రత్యేకించి తుషార్‌ పేరును తెరపైకి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో రాజ్‌భవన్‌ పాత్ర ఉందని చెప్పే విధంగా అధికారిక ట్విటర్‌ ఖాతాల్లో రాసుకొచ్చారు. నా ఫోన్‌ ట్యాప్‌ అవుతుందనే అనుమానం ఉంది. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది.  తుషార్‌ ఫోన్‌ చేసి దీపావళి శుభాకాంక్షలు చెబితే ఆయన పేరు ఎలా తెచ్చారు. నా ఫోన్‌ ట్యాప్‌ చేసుకోండి.. కావాలంటే నా ఫోన్‌ ఇస్తాను చూసుకోండి. గవర్నర్ల అంశాలు, వివాదాలు ఒక్కో రాష్ట్రంలో వేర్వేరుగా ఉన్నాయి. ఖైదీల విడుదలలో హోంశాఖ విధానాలను పాటించలేదు. జీవితఖైదు పడిన వారిని  విడుదల చేయరాదు. రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానం అమలవుతోందనే అనుమానం ఉంది. రాజ్‌భవన్‌ ముందు ఆందోళన చేస్తామని ప్రకటించిన వారి వెనుక ఎవరున్నారు. ఎవరు వచ్చినా.. ఎంతమంది వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నా’’ అని గవర్నర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని