TTD: తిరుమలలో గదుల అద్దె పెంపుపై రాజకీయం బాధాకరం: ఈవో ధర్మారెడ్డి

వీఐపీలు బస చేసే అతిథి గృహాల్లోని 172 గదులకు మాత్రమే అద్దె ధరలు పెంచామని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రూ.50, రూ.100ల అద్దె గదుల ధరలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 

Published : 13 Jan 2023 01:54 IST

తిరుమల: తిరుమలలో గదుల అద్దె పెంపు విషయంలో రాజకీయం చేయడం చాలా బాధాకరమని తితిదే ఈవో ధర్మారెడ్డి అన్నారు. వీఐపీలు బస చేసే అతిథి గృహాల్లోని 172 గదులను మాత్రమే ఆధునికీకరించి ధరలు పెంచామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి నుంచి సామాన్య భక్తులను దూరం చేస్తున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఇవాళ ఈవో ధర్మారెడ్డి  అన్నమయ్య భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రముఖులకు సంబంధించి పద్మావతి, ఎంబీసీ కార్యాలయాల్లో గదులను ఇస్తారని, నారాయణగిరి, ఎస్వీ అతిథిగృహం, స్పెషల్‌ టైప్‌ అతిథి గృహాలు ఎంబీసీ కార్యాలయం కింద ఉన్నాయన్నారు. అందుకే రూ.8కోట్లతో ఆ అతిథిగృహాలను ఆధునికీకరించామన్నారు. ఏసీ, గీజర్‌ వంటి సౌకర్యాలు పెంచి గదుల అద్దె పెంచామన్నారు. ఒక్కొక్క గదికి రూ.5లక్షల చొప్పున ఖర్చు చేశామని వివరించారు. తిరుమలలో ఉన్న మిగతా రూ.50, రూ.100ల అద్దె గదుల ధరలు పెంచే ఆలోచన లేదని తెలిపారు. తిరుమలలో మొత్తం 7,500 గదులు, నాలుగు యాత్రిక సదన్‌లు ఉన్నాయన్నారు. రూ.50, రూ.100ల అద్దె గదులు 5వేలు ఉన్నాయని, ఈ ధరలు 40 ఏళ్ల క్రితం నిర్ణయించారని ఈవో వెల్లడించారు. రూ.50, రూ.100ల గదుల్లో ఫ్లోరింగ్‌, గీజర్లు వంటి వసతులు కల్పించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని